మంచిర్యాల :ట్రాక్టర్ యజమానులందరూ ఐక్యంగా ముందుకు రావాలి.
పెరిగిన డీజిల్, విడిభాగాల ధరలకు అనుగుణంగా ట్రాక్టర్ కిరాయిలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది – సమావేశం ఏర్పాటు చేసుకుందాం…
మంచిర్యాల : అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 6.
మంచిర్యాలలో ఆన్‌లైన్ ఇసుక సరఫరా విధానం ప్రారంభం కాకముందు నుంచి వాగులు, గోదావరి పరిసర ప్రాంతాల నుంచి మున్సిపల్ కాంట్రాక్టులు, రెవెన్యూ వే బిల్లుల ద్వారా ఇసుక, బండ, మొరం తదితర నిర్మాణ సామగ్రిని ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. అయితే గత కొన్నేళ్లుగా ఈ మెటీరియల్స్ రవాణాకు పాత కిరాయిలే కొనసాగుతున్నాయి. అదే సమయంలో డీజిల్ ధరలు, ట్రాక్టర్ విడిభాగాలు, మరమ్మతుల ఖర్చులు గణనీయంగా పెరిగాయి.
ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ ట్రాక్టర్ కిరాయిలు మాత్రం పెరగకపోవడంతో యజమానులకు ఆశించిన ఆదాయం రావడం లేదు. ట్రాక్టర్ నిర్వహణ ఖర్చులు పోను చేతికి ఏమీ మిగలని పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి మరికొంతకాలం కొనసాగితే ట్రాక్టర్లను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది.
ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు మంచిర్యాల ట్రాక్టర్ యజమానులందరూ ఒకే వేదికపైకి వచ్చి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆన్‌లైన్ ఇసుక రేట్లు, ఇసుక రవాణా కిరాయిలు, బండ, మొరం తదితర ఇతర నిర్మాణ సామగ్రి రవాణా ధరలపై సమగ్రంగా చర్చించుకోవాలి.
ఈ సమావేశానికి గతంలో ట్రాక్టర్ యజమానుల సంఘాన్ని నిర్వహించిన సీనియర్ నాయకులతో పాటు ప్రస్తుతం ట్రాక్టర్లు నడుపుతున్న యజమానులు, సంఘం పెద్దలను కూడా ఆహ్వానించాలి. వారి అనుభవాలు, సూచనలు, సలహాలు తీసుకొని అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయానికి రావాలి.
అనంతరం ట్రాక్టర్ యజమానుల సమస్యలను గౌరవనీయులైన స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో పాటు జిల్లా కలెక్టర్, మైనింగ్ ఏడీ అధికారులకు వినతిపత్రాలు, మెమోరాండాలు సమర్పించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ట్రాక్టర్ కిరాయిలను సవరించడం, ఆన్‌లైన్ ఇసుక సరఫరా విధానంలో ప్రతిరోజూ ఆన్‌లైన్ బుకింగ్‌లు అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులతో చర్చించడం వంటి అంశాలపై దృష్టి సారించాలి.
ఈ విజ్ఞప్తి ఎవరినీ ఉద్దేశించి చేస్తున్నది కాదు. ఎలాంటి పదవుల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కూడా ఈ ప్రయత్నం చేయడం లేదు. ట్రాక్టర్ యజమానులందరి జీవనోపాధి, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అందరి ప్రయోజనం కోసం ఈ ప్రతిపాదన చేస్తున్నాం.
కాబట్టి మంచిర్యాల ట్రాక్టర్ యజమానులందరూ వ్యక్తిగత అభిప్రాయాలు, విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా ముందుకు రావాలి. దీపావళి పండుగ అనంతరం అందరికీ అనుకూలమైన ఒక రోజున సమావేశం ఏర్పాటు చేసి, సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుందాం.
ట్రాక్టర్ యజమానుల ఐక్యతే మన బలం. మన కిరాయిలు పెరగాలి.. మన ఉపాధి నిలవాలి.. అందరం కలిసి ఈ సమస్యకు పరిష్కారం కనుగొందాం. ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.