ప్రతి నెల 1,000 ప్యాకెట్ల రక్తం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి
-మంచిర్యాల జిల్లా కలెక్టర్కు థలసేమియా వెల్ఫేర్ సొసైటీ వినతి.
అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 07. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల, సెప్టెంబర్ 7: మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలో రక్త నిల్వల కొరతను నివారించి, ప్రతి నెల అవసరమైన రక్తం అందుబాటులో ఉండేలా సమగ్ర రక్తదాన ప్రణాళిక రూపొందించాలని కోరుతూ థలసేమియా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ చంద్రయ్య గారికి వినతిపత్రం అందజేశారు.మంచిర్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వల కొరత తీవ్రంగా ఉందని, దీనివల్ల నిరంతరం రక్త మార్పిడి అవసరమయ్యే థలసేమియా, సికిల్ సెల్ చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతినిధులు తెలిపారు.ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ద్వారా మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో చికిత్స పొందుతున్న అవసరమైన రోగులకు ఉచితంగా రక్తాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. గర్భిణీలు, కిడ్నీ డయాలసిస్ రోగులు, రక్తహీనతతో బాధపడుతున్న వారు, అత్యవసర శస్త్రచికిత్సలు అవసరమైన రోగులు, రోడ్డు ప్రమాద బాధితులు తదితరులకు రక్తం అత్యవసరంగా అవసరమవుతుందని వివరించారు.
ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రతి నెల కనీసం 1,000 మంది రక్తదానం చేసే విధంగా “వన్ ఇయర్ బ్లడ్ డొనేషన్ క్యాలెండర్” రూపొందించాలని కోరారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, సింగరేణి, విద్యాశాఖ, ఆబ్కారీ శాఖ, అటవీ శాఖ, మెడికల్ కాలేజీ, కళాశాల విద్యార్థులు, విద్యాసంస్థల యాజమాన్యాలు తదితర శాఖలు, సంస్థలతో సమన్వయం చేసి నెలవారీ రక్తదాన శిబిరాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి, ముందుగానే నెలవారీ రక్తదాన శిబిరాల తేదీలను నిర్ణయిస్తే రక్త నిల్వల కొరతను నివారించవచ్చని సొసైటీ ప్రతినిధులు సూచించారు.
వినతిపత్రంపై జాయింట్ కలెక్టర్ చంద్రయ్య గారు సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత శాఖల అధికారులకు లేఖలు రాసి రక్తదాన శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని, వన్ ఇయర్ బ్లడ్ డొనేషన్ క్యాలెండర్ రూపొందించేందుకు కృషి చేస్తామని, అవసరమైన ప్రతి రోగికి రక్తం అందుబాటులో ఉండేలా సమన్వయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో థలసేమియా వెల్ఫేర్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు చుంచు శంకర్ వర్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ బొజ్జా వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.