జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ.
జగిత్యాల ప్రతినిధి ::అర్జున్ సమాచారం అక్టోబర్ 10::
విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్న మంత్రి.. త్వరలోనే మౌలిక వసతులు కల్పిస్తామని హామీ.
జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నిర్మాణ పనులు, మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
గత రెండు రోజుల క్రితం కళాశాల నిర్మాణ పనులు, మౌలిక వసతులు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులతో ఫోన్లో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు.
ఈ క్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి విద్యార్థుల సమస్యలను తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రులు, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి మెడికల్ కళాశాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
విద్యార్థులతో ఫోన్లో మాట్లాడిన సందర్భంగా స్వయంగా కళాశాలకు వచ్చి వారితో సమావేశమై సమస్యలను తెలుసుకుంటానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను, కళాశాలలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని, వారి సమస్యలను సంబంధిత మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.