ఇచ్చిన హామీ నెరవేర్చిన మంత్రి శ్రీధర్‌బాబుతీరనున్న రైతుల కష్టాలు.. నేడు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 23
కమాన్‌పూర్ మండలంలోని రాజాపూర్ నుంచి మంగపేటకు వెళ్లే రహదారిలో బండలవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇచ్చిన హామీ నెరవేరనుంది. మూడు కోట్ల 90 లక్షల రూపాయల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంతో సోమవారం భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు.
గుండారం రిజర్వాయర్ నుంచి వచ్చే బండలవాగుకు వరద వచ్చిన సమయంలో కమాన్‌పూర్, కిష్టంపల్లి, రాజాపూర్, గుండారం గ్రామాలకు చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వాగు దాటలేక తమ వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు సుమారు 10 కిలోమీటర్ల దూరం చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రైతులు నేరుగా తమ పొలాలకు చేరుకునే అవకాశం ఏర్పడి దశాబ్దాల నాటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
గత ఎన్నికల సమయంలో మంథని ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు రైతులకు ఇచ్చిన హామీ మేరకు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారని రైతులు పేర్కొన్నారు. వందలాది మంది రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల ఇప్పుడు సాకారం కానుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బ్రిడ్జి మంజూరుకు కృషి చేసిన మంత్రి శ్రీధర్‌బాబుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. గుండారం మాజీ సర్పంచ్ పిడుగు నరసయ్య మాట్లాడుతూ గుండారం, కమాన్‌పూర్, రాజాపూర్, కిష్టంపల్లి గ్రామాల రైతులు మంత్రి శ్రీధర్‌బాబు చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోరని అన్నారు. బండలవాగుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే నాలుగు గ్రామాల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, రైతుల తరఫున మంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.