ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 10:35 am Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఆదర్శంగా నిలిచిన నాగేపల్లి సర్పంచ్.. ప్రభుత్వ పాఠశాలలోనే తన పిల్లల ప్రవేశం

ఆదర్శంగా నిలిచిన నాగేపల్లి సర్పంచ్.. ప్రభుత్వ పాఠశాలలోనే తన పిల్లల ప్రవేశం

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచారం, జూన్ 30:

ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చాటుతూ నాగేపల్లి గ్రామ సర్పంచ్ కొండవెన దివ్యసుధాకర్ యాదవ్ ఆదర్శంగా నిలిచారు. తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ విద్యపై తన నమ్మకాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామ సర్పంచ్‌గా తాను చెప్పేది మాత్రమే కాదు, చేసి చూపించాలనే నమ్మకం తనదని అన్నారు. అందుకే తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలపై ప్రతి తల్లిదండ్రి విశ్వాసం పెంచుకోవాలని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

తన కుటుంబం నుంచే ఈ మార్పుకు శ్రీకారం చుట్టిన నాగేపల్లి సర్పంచ్ చర్యను గ్రామస్థులు అభినందిస్తూ, ఇతర ప్రజాప్రతినిధులకు కూడా ఇది ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు.