ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 11:52 am Posted by : ARJUN SAMAACHAARAM DESK

సింగరేణి అధికారుల నిర్లక్ష్యం: రాజాపూర్ గ్రామానికి గండి పడే ప్రమాదం!, ఇరిగేషన్ అధికారులకు తెలియకుండానే భారీ హిటాచీలతో పనులు, ఎల్6 కెనాల్ వైపు వర్షపు నీటి మళ్లింపు.. గ్రామస్తుల్లో తీవ్ర అభద్రతాభావం, సింగరేణి అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

సింగరేణి అధికారుల నిర్లక్ష్యం: రాజాపూర్ గ్రామానికి గండి పడే ప్రమాదం!, ఇరిగేషన్ అధికారులకు తెలియకుండానే భారీ హిటాచీలతో పనులు, ఎల్6 కెనాల్ వైపు వర్షపు నీటి మళ్లింపు.. గ్రామస్తుల్లో తీవ్ర అభద్రతాభావం, సింగరేణి అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

రామగిరి (పెద్దపల్లి జిల్లా),అర్జున్ సమాచారం,: జూలై 31

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సింగరేణి ప్రభావిత ప్రాంతమైన రాజాపూర్ గ్రామంలో సింగరేణి అధికారుల తప్పుడు నిర్ణయాలు, నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజాపూర్ గ్రామంలో అధిక మొత్తంలో వర్షపు నీరు వచ్చి చేరింది. అయితే ఈ సమస్యను శాస్త్రీయంగా పరిష్కరించాల్సింది పోయి, సింగరేణి ఆర్‌జి-3 జనరల్ మేనేజర్ మధుసుదన్ రావు స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని ఇరిగేషన్ శాఖాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గ్రామానికి ఇటీవల కొత్తగా నిర్మించిన రహదారి పక్కనే, లక్షలాది రూపాయల వ్యయంతో భారీ ఎక్స్కవేటర్ (హిటాచీ)లను రప్పించి ఎల్-6 కెనాల్ వైపు వర్షపు నీటిని మళ్లించేలా తవ్వకాలు చేపట్టారు. వానాకాలం సీజన్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ఈ కెనాల్‌కు గండి పడే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

ఈ విషయమై మా ప్రతినిధి ఇరిగేషన్ అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించగా.. “రాజాపూర్ గ్రామంలో సింగరేణి యాజమాన్యం చేపడుతున్న ఈ తవ్వకాలు, నీటి మళ్లింపు పనులపై మాకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదు” అని స్పష్టం చేశారు. ఒక ప్రభుత్వ శాఖకు చెందిన కెనాల్ వద్ద మరో సంస్థ అధికారులు ఇరిగేషన్ శాఖ అనుమతి లేకుండా పనులు చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవైపు కొత్తగా నిర్మించిన రోడ్డు దెబ్బతినే అవకాశం ఉండటంతో పాటు, నీటి ప్రవాహం పెరిగి కెనాల్ తెగిపోతే గ్రామం జలమయమై తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని రాజాపూర్ గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు చోద్యం చూడకుండా వెంటనే స్పందించి ఈ అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని, గ్రామానికి ముప్పు కలిగించేలా వ్యవహరించిన సింగరేణి అధికారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని రాజాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.