జైపూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.
-పోలీస్ స్టేషన్ నిర్వహణ,సాంకేతిక పరిజ్ఞానం వినియోగం,రోడ్డు ప్రమాదాల నివారణపై ఆదేశాలు.
అర్జున్ సమాచారం. అక్టోబర్ 14. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
జైపూర్ మండలం:రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం జైపూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి,సిబ్బంది విధుల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు.
స్టేషన్ పరిధిలో తరచుగా నమోదవుతున్న నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఎస్ఐ భూమేష్ను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐ,స్టేషన్ రైటర్, సీసీటీఎన్ఎస్ రైటర్లతో మాట్లాడి ఆన్లైన్లో వివరాల నమోదు,కేసులు మరియు రికార్డుల అప్లోడ్ ప్రక్రియను పరిశీలించారు.నేరాల నియంత్రణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని సీపీ సూచించారు. రౌడీషీటర్లు,సస్పెక్ట్ షీట్లో ఉన్న వ్యక్తులు,ఇతర నేరస్తుల ఇళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ,వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్లో 5S మేనేజ్మెంట్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.స్టేషన్ పరిసరాలు, రికార్డులు,ఫైళ్లు, పరికరాలు,పని ప్రదేశాలను పరిశుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచాలని తెలిపారు.
స్టేషన్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి,సిబ్బందికి సీసీటీఎన్ఎస్పై పూర్తి అవగాహన ఉండాలని, అవసరమైన వారికి శిక్షణ అందించి వ్యవస్థపై పూర్తి పట్టు సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు తమ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీపీ ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి,సంబంధిత శాఖల సమన్వయంతో హెచ్చరిక బోర్డులు, రహదారి సూచికలు, రంబుల్ స్ట్రిప్స్ తదితర భద్రతా ఏర్పాట్లు చేయించాలని సూచించారు.
అతివేగం,మద్యం సేవించి వాహనాలు నడపడం,హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగించకపోవడం,రాంగ్ రూట్లో వాహనాలు నడపడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రజల్లో రోడ్డు భద్రతపై నిరంతరం అవగాహన కల్పిస్తూ, ప్రమాదాల నివారణకు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
ఈ తనిఖీలో సీపీ వెంట జైపూర్ ఏసీపీ ఆర్.వెంకటేశ్వర్లు, జైపూర్ సీఐ నవీన్ కుమార్ ఉన్నారు.