ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 6:56 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఎక్లాస్‌పూర్‌లో బెల్ట్ షాపులపై పోలీసుల మెరుపు దాడులు,కాటన్ల కొద్దీ మద్యం స్వాధీనం.. నిర్వాహకులకు స్టేషన్‌కు పిలుపు.

ఎక్లాస్‌పూర్‌లో బెల్ట్ షాపులపై పోలీసుల మెరుపు దాడులు,కాటన్ల కొద్దీ మద్యం స్వాధీనం.. నిర్వాహకులకు స్టేషన్‌కు పిలుపు.

అర్జున్ సమాచారం // అక్టోబర్ 4 // మంథని రిపోర్టర్.

మంథని మండలం ఎక్లాస్‌పూర్ గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై మంథని పోలీసులు ఆదివారం మెరుపు దాడులు నిర్వహించారు. గ్రామపంచాయతీ పాలకవర్గం బెల్ట్ షాపులు మూసివేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినప్పటికీ, కొందరు నిర్వాహకులు మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారంటూ గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఎక్లాస్‌పూర్ నుంచి శాస్త్రులపల్లె వెళ్లే మార్గంలో ఒక వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అదేవిధంగా ఎక్లాస్‌పూర్ శివారులోని నెల్లిపల్లి ప్రాంతంలో మరో వ్యక్తి ఇంట్లో మద్యం నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. రెండు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి కాటన్ల కొద్దీ వివిధ బ్రాండ్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని మంథని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించిన వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని పోలీసులు ఆదేశించారు. నిబంధనల మేరకు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కాగా, గ్రామంలో బెల్ట్ షాపుల నిర్వహణపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కూడళ్లు, కొన్ని ఇళ్లలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. దీనివల్ల యువతపై ప్రభావం పడటంతో పాటు రాత్రి వేళల్లో గొడవలు జరుగుతున్నాయని మహిళలు పేర్కొంటున్నారు.

గ్రామపంచాయతీ పాలకవర్గం గతంలోనే గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహించరాదని తీర్మానం చేసి నిర్వాహకులను హెచ్చరించినట్లు గ్రామస్తులు తెలిపారు. అయినప్పటికీ విక్రయాలు కొనసాగుతుండటంతో పోలీసులకు సమాచారం అందించామని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, కొందరు వ్యక్తులు ఫోన్ ద్వారా ఆర్డర్లు తీసుకుని ఇళ్లకు మద్యం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలపై నిరంతరం నిఘా ఉంచి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులను కోరుతున్నారు.