ప్రజల చెంతకే పోలీస్: నేరరహిత సమాజమే లక్ష్యంగా ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్’
ఎసన్వాయి గ్రామంలో జైపూర్ ఏసీపీ, ఎక్సైజ్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
1,000 లీటర్ల బెల్లపు పానకం ధ్వంసం.. 30 లీటర్ల గుడుంబా స్వాధీనం
సరైన పత్రాలు లేని 35 వాహనాలు సీజ్
కోటపల్లి (మంచిర్యాల ప్రతినిధి): అర్జున్ సమాచారం, జూలై 25 ,
నేరాల నిర్మూలన, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (డిఐజి), మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్ ఆదేశాల మేరకు కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎసన్వాయి గ్రామంలో శనివారం తెల్లవారుజామున ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్’ నిర్వహించారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సివిల్, ఎక్సైజ్ పోలీసులు ఉమ్మడిగా ఈ ఆకస్మిక తనిఖీ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో 50 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు 30 మంది ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటినీ సోదా చేస్తూ నివాసితుల వివరాలను సేకరించారు. అనుమానాస్పద వ్యక్తులు, గ్రామంలోకి కొత్తగా వచ్చిన వారి కదలికలపై నిఘా పెట్టారు. తనిఖీల్లో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
గ్రామంలో గుడుంబా తయారీ జరుగుతోందనే సమాచారంతో స్థావరాలపై సివిల్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో గుడుంబా తయారీ కోసం సిద్ధంగా ఉంచిన 1,000 లీటర్ల బెల్లపు పానకాన్ని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అలాగే 30 లీటర్ల నిషిద్ధ గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీ, అమ్మకాలకు పాల్పడుతున్న 9 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెన్నూర్ ఎక్సైజ్ సీఐ హరి తెలిపారు.
ఈ తనిఖీల్లో చెన్నూరు రూరల్ సీఐ ఆర్.కృష్ణ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ట్రైనీ) శ్రీరామ్ రెడ్డి, ఎక్సైజ్ సీఐలు సమ్మయ్య, అక్బర్ హుస్సేన్, కోటపల్లి మరియు నిల్వాయి ఎస్ఐలు, ఎక్సైజ్ ఎస్ఐ రమణ, పోలీస్ & ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు