ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలి.
అర్జున్ సమాచారం.జులై 17. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
హైదరాబాద్: ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని, పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి కోరారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీమారం జగదీశ్వర్ అధ్యక్షతన జరిగిన కేంద్ర కార్యవర్గ సమావేశంలో మంచిర్యాల జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ ఉపయోగపడేలా ఈహెచ్ఎస్ కార్డులు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైన నేపథ్యంలో ఉద్యోగులకు 17 శాతం ఇంటి అద్దె భత్యం కల్పించేందుకు కేంద్ర సంఘం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం బకాయిలను వెంటనే చెల్లించాలని, 22ఏ పరిధిలో ఉన్న టీఎన్జీవో భూములకు మినహాయింపు కల్పించాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేంద్ర సంఘం ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు.
కేంద్ర కార్యవర్గ సమావేశంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్‌కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య పాల్గొన్నారు. ఇటీవల మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన బొడ్డు శ్రావణ్‌కుమార్‌ను కేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.