ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 3:05 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

పన్నూర్ సమస్యల పరిష్కారానికి సర్పంచ్ చిందం మహేష్ వినత బస్‌షెల్టర్ల పరిశుభ్రత, డ్రైనేజీ సమస్య, ఐమాక్స్ లైట్ల ఏర్పాటుకు జీఎంకు విజ్ఞప్తి.

పన్నూర్ సమస్యల పరిష్కారానికి సర్పంచ్ చిందం మహేష్ వినత బస్‌షెల్టర్ల పరిశుభ్రత, డ్రైనేజీ సమస్య, ఐమాక్స్ లైట్ల ఏర్పాటుకు జీఎంకు విజ్ఞప్తి.

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 25

రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పన్నూర్ సర్పంచ్ చిందం మహేష్ మంగళవారం ఆర్జీ–3 జీఎం కార్యాలయంలో జీఎం సుంకరి మధుసూదన్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామ ప్రజలు, సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను జీఎం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

పన్నూర్ సెంటర్, శ్రీలంక క్వార్టర్స్ వద్ద ఉన్న సింగరేణి బస్‌షెల్టర్లలో చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా మారిందని సర్పంచ్ తెలిపారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటంతో దోమల బెడద పెరుగుతోందని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వకీల్‌పల్లె, విద్యానగర్ ప్రాంతాల్లోని అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలో సరైన చాంబర్లు లేకపోవడంతో మురుగునీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. అవసరమైన ప్రాంతాల్లో చాంబర్లు ఏర్పాటు చేసి డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో శుభ్రపరిచి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

పన్నూర్ సెంటర్ నుంచి ఏఎల్‌పీ మైన్ వరకు, గ్రామంలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో రాత్రి వేళల్లో సరైన వెలుతురు లేకపోవడంతో సింగరేణి కార్మికులు, గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజలు, సింగరేణి కార్మికుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి వీలైనంత త్వరగా పరిష్కరించాలని సర్పంచ్ చిందం మహేష్ జీఎం సుంకరి మధుసూదన్‌ను కోరారు.