సింగరేణి బకాయిలు వెంటనే చెల్లించాలి..బీజేపీ ఆధ్వర్యంలో నిరసన.. ఈటల రాజేందర్.
మంచిర్యాల. అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 30.
: సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల సీసీసీ కార్నర్ వద్ద బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సింగరేణి బకాయి.. బీజేపీ పోరాటం’ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్, సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్‌బాబు, శాసనమండలి సభ్యుడు మల్క కొమురయ్యతో పాటు సింగరేణి ప్రాంత జిల్లాల బీజేపీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రభుత్వం సింగరేణి సంస్థను రూ.28 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలను రూ.55 వేల కోట్లకు పెంచిందని ఆరోపించారు. దీంతో సింగరేణి సంస్థ మనుగడపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. సింగరేణి సమస్యలపై రఘునాథ్ వెరబెల్లి నిరంతరం పోరాడుతున్నారని పేర్కొన్నారు.
ఒకప్పుడు సింగరేణిలో 1.16 లక్షల మంది శాశ్వత కార్మికులు ఉండేవారని, ప్రస్తుతం 39 వేల మంది మాత్రమే ఉన్నారని రాజేందర్ తెలిపారు. మరో 70 వేల మంది పొరుగు సేవల కార్మికులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సింగరేణిపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని అన్నారు.
సింగరేణి సంస్థకు సంబంధించిన బకాయిల్లో అసలు, వడ్డీ కలిపి రూ.55 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు అవసరమైన పనిముట్లు, రక్షణ పరికరాలు సమకూర్చాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సింగరేణి ప్రాంతాలకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.