ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 7:53 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సింగరేణి వాస్తవ లాభాలను ప్రకటించాలి.

సింగరేణి వాస్తవ లాభాలను ప్రకటించాలి.

కార్మికులకు 36 శాతం లాభాల వాటా చెల్లించాలి
అభివృద్ధి పేరిట కోతలు లేకుండా లాభాల వాటా ఇవ్వాలి
ఆర్‌జీ-3లో అన్ని గనుల్లో టీబీజీకేఎస్ నాయకుల వినతిపత్రాలు

అర్జున్ సమాచారం // అక్టోబర్ 5 // రామగిరి రిపోర్టర్.

సింగరేణి కార్మికుల శ్రమతో సంస్థకు లాభాలు వస్తున్నందున గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, 36 శాతం లాభాల వాటాను ఎలాంటి కోతలు లేకుండా కార్మికులకు చెల్లించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆర్‌జీ-3 ఏరియా ఉపాధ్యక్షుడు నాగేల్లి సాంబయ్య డిమాండ్ చేశారు.

సోమవారం టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆదేశాల మేరకు ఆర్‌జీ-3 డివిజన్‌లోని అన్ని గనులు, డిపార్ట్‌మెంట్ల వద్ద మేనేజర్లు, ఉన్నతాధికారులకు నాయకులు వినతిపత్రాలు సమర్పించారు. ఆయా గనుల నుంచి నాయకులు, కార్మికులు ర్యాలీగా వెళ్లి నినాదాలు చేస్తూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా నాగేల్లి సాంబయ్య మాట్లాడుతూ కార్మికులు అనేక కష్టనష్టాలను ఓర్చుకుంటూ, అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ, ప్రమాదాల మధ్య పనిచేసి బొగ్గును వెలికితీస్తూ సంస్థకు లాభాలు తీసుకువస్తున్నారని అన్నారు. అలాంటి కార్మికులకు లాభాల్లో న్యాయమైన వాటా కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు.

అభివృద్ధి నిధుల పేరిట కోతలు

2022–23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.2,222 కోట్ల లాభాలు ఆర్జించగా, 32 శాతం లాభాల వాటాను కార్మికులకు చెల్లించారని సాంబయ్య తెలిపారు. టీబీజీకేఎస్ హయాంలో సంస్థ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు పక్కన పెట్టలేదని పేర్కొన్నారు.

2023–24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి రూ.4,701.3 కోట్ల లాభాలు వచ్చినట్లు ప్రకటించారని, 33 శాతం లాభాల వాటా ప్రకటించినప్పటికీ సంస్థ అభివృద్ధి పేరిట రూ.2,289 కోట్లు పక్కన పెట్టి, మిగిలిన మొత్తంలో రూ.2,412 కోట్లు మాత్రమే కార్మికులకు పంపిణీ చేశారని తెలిపారు. ఇది లాభాల వాటా ప్రకారం 16.9 శాతంగా ఉందన్నారు.

అదేవిధంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.6,394 కోట్ల లాభాలు వచ్చినట్లు వెల్లడించారని, సంస్థ అభివృద్ధి పేరుతో రూ.4,034 కోట్లు పక్కన పెట్టి, మిగిలిన మొత్తంలో రూ.2,360 కోట్లు మాత్రమే కార్మికులకు పంపిణీ చేశారని తెలిపారు. ఇది లాభాల వాటా ప్రకారం 12.5 శాతం మాత్రమేనని పేర్కొన్నారు.

2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాల్లో కలిపి రూ.6,323 కోట్లు సంస్థ అభివృద్ధి కోసం పక్కన పెట్టారని ఆయన తెలిపారు. ఆ నిధులతో సంస్థకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు, ఎలాంటి కొత్త వాహనాలు, ఇతర పరికరాలు సమకూర్చారో యాజమాన్యం కార్మికులకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

సింగరేణి సంస్థ భవిష్యత్తు, కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, ఎలాంటి కోతలు లేకుండా 36 శాతం లాభాల వాటాను దసరాకు వారం, పది రోజుల ముందే కార్మికులకు పంపిణీ చేయాలని కోరారు. లాభాల వాటా చెల్లింపులో ఆలస్యం జరిగితే కార్మికులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

టీబీజీకేఎస్ నాయకులు సమర్పించిన వినతిపత్రాన్ని ఉన్నతాధికారులకు పంపిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పింగిలి సంపత్ రెడ్డి, సెంట్రల్ జాయింట్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు దేవ శ్రీనివాస్, ఈసంపల్లి రమేష్, గట్టు శ్రీనివాస్, బోయినపల్లి శ్రీకాంత్ రావు, బ్రాంచ్ సెక్రటరీలు అల్లం తిరుపతి, దాసరి మల్లేష్, బోట్ల శివశంకర్తో పాటు వివిధ గనుల పిట్ కమిటీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.