చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం మంథని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 10 / మంథని రిపోర్టర్
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు సూచనల మేరకు గురువారం మంథనిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, మాజీ ఎంపీపీ కొండ శంకర్ మాట్లాడుతూ.. భూమి, భుక్తి, విముక్తి కోసం నాటి నిరంకుశ పాలనకు ఎదురొడ్డి నిలిచిన చాకలి ఐలమ్మ ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట పటిమ తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
ఐలమ్మ తన భూమి కోసం మాత్రమే కాకుండా పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడారని పేర్కొన్నారు. సామాజిక అన్యాయం, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
చాకలి ఐలమ్మ త్యాగాలు, పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాలని, ఆమె ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.