ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 5:39 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామ సభ వేదిక…

ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామ సభ వేదిక…

అర్జున్ సమాచారం,నవంబర్ 28.రామగిరి రిపోర్టర్.

గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,కల్వచర్ల సర్పంచ్ రేండ్ల శారద కుమారస్వామి.

రామగిరి, నవంబర్ 28: గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కల్వచర్ల సర్పంచ్ రేండ్ల శారద కుమారస్వామి అన్నారు.

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం సర్పంచ్ రేండ్ల శారద కుమారస్వామి అధ్యక్షతన జనరల్ గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు కలిగే ప్రయోజనాలు, అర్హతలు, అమలు విధానాన్ని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

గ్రామ సభలో ప్రజలు తమ సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా గ్రామంలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోందని, వాటి సంచారంతో చిన్నపిల్లలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోతులు ఇళ్లలోకి చొరబడుతూ ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడంతో పాటు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు.

దీనిపై సర్పంచ్ శారద కుమారస్వామి స్పందిస్తూ గ్రామస్థులు తెలియజేసిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కోతుల బెడద నివారణకు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామని తెలిపారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై గ్రామ సభలకు హాజరై తమ సమస్యలు, సూచనలు తెలియజేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉప్పులేటి ప్రదీప్, ఉపసర్పంచ్ కస్ప మహేందర్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.