బీసీ రాజకీయ హక్కుల కోసం యువత ఉద్యమించాలి..బహుజన రాజ్యాధికార సాధనకు యువత ముందుకు రావాలి: మహేష్ వర్మ.
అర్జున్ సమాచారం. ఆగస్టు 21. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల: మంచిర్యాల నియోజకవర్గంలో బీసీ నాయకత్వం రాజకీయంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు మహేష్ వర్మ అన్నారు. తన కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య సమావేశంలో రాజకీయ పార్టీల్లో సామాజిక వర్గాల ప్రాతినిధ్యంపై విస్తృతంగా చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా మహేష్ వర్మ మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం గణనీయమైన జనాభాను కలిగి ఉన్నప్పటికీ రాజకీయ నిర్ణయ ప్రక్రియలో, నాయకత్వ అవకాశాల్లో తగిన స్థాయిలో ప్రాతినిధ్యం లభిస్తుందా అనే అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూడకుండా నాయకత్వ అవకాశాలు కల్పించాలని కోరారు.
బీసీ సామాజిక వర్గానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉందని ఆయన స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ నాయకులను ప్రోత్సహించి రాజకీయంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి సామాజిక వర్గానికి సముచిత రాజకీయ భాగస్వామ్యం కల్పించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.
బహుజన యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై చురుకుగా పనిచేయాలని మహేష్ వర్మ పిలుపునిచ్చారు. బహుజన రాజ్యాధికార సాధన దిశగా యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కృషి చేస్తుందని తెలిపారు.
ప్రజా సంఘాలు, బీసీ నాయకులు, మేధావులు సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం, నాయకత్వ అవకాశాలపై నిర్మాణాత్మకంగా చర్చించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీసీ సమాజం తన హక్కులు, అవకాశాలు, రాజకీయ భాగస్వామ్యంపై చైతన్యంతో ముందుకు సాగాలని కోరారు.
త్వరలో బీసీ సంఘాల నాయకులు, మేధావులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మంచిర్యాల నియోజకవర్గంలో బహుజన రాజ్యాధికార సాధనలో బీసీ నాయకత్వం పాత్రపై విస్తృతంగా చర్చిస్తామని మహేష్ వర్మ తెలిపారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు పాకాల దినకర్, పాడాల శివతేజ పాల్గొన్నారు.