ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 4:14 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

లక్షలాది యువత ఆకాంక్షలకు ప్రతీక యూపీఎస్సీ:ప్రధాని మోదీ

లక్షలాది యువత ఆకాంక్షలకు ప్రతీక యూపీఎస్సీ:
ప్రధాని మోదీ.

న్యూఢిల్లీ:అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 1

యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ

స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్‌ను ఆవిష్కరించిన ప్రధాని

లక్షలాది మంది యువత ఆశయాలకు యూపీఎస్సీ ప్రతీక అని వ్యాఖ్య
సర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ సేవలను స్మరించుకున్న ప్రధాని
భారత పైలట్ స్మిత్ ధైర్యాన్ని కొనియాడిన మోదీ

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వందేళ్ల ప్రస్థానం లక్షలాది మంది యువత ఆకాంక్షలకు, దేశ ప్రజల నమ్మకానికి ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. గురువారం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్‌తో పాటు ‘100 ల్యాండ్‌మార్క్ జడ్జిమెంట్స్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నిన్న‌ జరిగిన ఒక విమాన ప్రమాద ఘటనలో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారత పైలట్, కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. “నిన్న జరిగిన ఘటనలో భారత పైలట్ కెప్టెన్ స్మిత్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, నిబద్ధత ప్రశంసనీయం. ఇజ్రాయెల్ ప్రధాని చెప్పినట్లుగా, 9/11 తరహా ఘోర విషాదాన్ని ఒక భారతీయుడు అడ్డుకున్నాడు” అని మోదీ అన్నారు. స్మిత్ ఘనత మనందరికీ గర్వకారణమని, తాను ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడానని తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న స్మిత్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని దేశ ప్రజలందరూ ప్రార్థించాలని పిలుపునిచ్చారు. యూపీఎస్సీ వందేళ్ల ప్రస్థానంపై మోదీ మాట్లాడుతూ.. “ఇది కేవలం ఒక సంస్థ వందేళ్లు పూర్తి చేసుకోవడం కాదు, ఇది లక్షలాది యువత ఆశయాల వేడుక. ప్రతి భారతీయుడు ఈ సంస్థపై ఉంచిన అచంచల విశ్వాసానికి ఇది నిలువుటద్దం. ఈ సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సివిల్ సర్వీసుల చరిత్రను, మహనీయుల సేవలను మోదీ గుర్తుచేసుకున్నారు. “1920లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆనాడు బ్రిటిష్ పాలన ఉన్నప్పటికీ ఆయన సంస్కృతంలో పేపర్ రాశారని ఇక్కడి గ్యాలరీలో చూశాను. అదేవిధంగా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశాన్ని నడపడంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారు. స్వతంత్ర భారతానికి అవసరమైన ‘ఉక్కు చట్రాన్ని’ (స్టీల్ ఫ్రేమ్) సర్దార్ పటేల్ అందించారు. ఈ సంస్థను దేశానికి ఒక ప్రధాన స్తంభంగా తీర్చిదిద్దారు” అని మోదీ వివరించారు.1926 అక్టోబర్ 1న పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా ప్రారంభమైన ఈ సంస్థ, శతాబ్ద కాలంలో ఎన్నో మార్పులకు లోనై స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థగా రూపుదిద్దుకుందని ప్రధాని గుర్తుచేశారు. గతేడాది అక్టోబర్ 1న ప్రారంభమైన శతాబ్ది ఉత్సవాలు ఈ కార్యక్రమంతో ముగిశాయి. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, విద్యావేత్తలు, యూపీఎస్సీ అధికారులు పాల్గొన్నారు.