ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 6:59 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

లద్నాపూర్‌లో సింగరేణి కంచె పనులను అడ్డుకున్న గ్రామస్తులు.

లద్నాపూర్‌లో సింగరేణి కంచె పనులను అడ్డుకున్న గ్రామస్తులు.

అర్జున్ సమాచారం // అక్టోబర్ 04 // రామగిరి రిపోర్టర్,

రామగిరి మండలం లద్నాపూర్ గ్రామంలో గ్రామ అవసరాల కోసం కేటాయించిన స్థలాలను సింగరేణి అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు, భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు. గ్రామానికి కేటాయించిన పోచమ్మ తల్లి ఆలయం, పిల్లల క్రీడా ప్రాంగణం, ఉపాధి కోసం ఏర్పాటు చేసిన నర్సరీ స్థలాల చుట్టూ సింగరేణి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారని వారు ఆరోపించారు.

అదేవిధంగా సింగరేణి డోజర్‌తో కొన్ని ఇళ్ల కాంపౌండ్ గోడలను కూల్చివేశారని గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న సింగరేణి భూనిర్వాసితుల నాయకుడు బర్ల శ్రీనివాస్, లద్నాపూర్ మొదటి వార్డు సభ్యురాలు చిప్ప లావణ్య సతీష్‌తో పాటు వార్డు ప్రజలు, గ్రామస్తులు, భూనిర్వాసితులు అక్కడికి చేరుకుని డోజర్ పనులను అడ్డుకున్నారు.

గ్రామ అవసరాల కోసం గతంలో అధికారులు కేటాయించిన స్థలాల్లో ఎలాంటి ఫెన్సింగ్ పనులు చేపట్టవద్దని వారు డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన వందల ఎకరాల భూములు, ఇళ్లు సింగరేణి ప్రాజెక్టుల కోసం కోల్పోయామని, ప్రస్తుతం గ్రామ అవసరాలకు ఉపయోగపడుతున్న స్థలాలను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడం సరికాదని అన్నారు.

పోచమ్మ తల్లి ఆలయం, క్రీడా ప్రాంగణం, నర్సరీ స్థలాలను గ్రామానికే కొనసాగించాలని డిమాండ్ చేశారు. సింగరేణి అధికారులు పనులు కొనసాగిస్తే గ్రామస్తులంతా ఏకమై అడ్డుకుంటామని, గ్రామ హక్కుల కోసం అవసరమైతే ధర్నాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.