ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 2:30 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం ఎప్పుడు?అత్యవసర వైద్య పరికరాలు అందుబాటులోకి తేవాలి — ప్రజల ప్రాణాలు కాపాడాలి

చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం ఎప్పుడు?అత్యవసర వైద్య పరికరాలు అందుబాటులోకి తేవాలి — ప్రజల ప్రాణాలు కాపాడాలి

అర్జున్ సమాచారం జులై 12 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి:

చెన్నూరు, ఆగస్టు 12: చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అఖిల భారత రైతు కూలీ సంఘం, ఐఎఫ్‌టీయూ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సరైన సమయంలో వైద్యం అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
చెన్నూరు గాంధీ చౌక్‌లో పాన్‌ దుకాణం నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్న శ్రీనివాస్ మూడు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందడం తమను తీవ్రంగా కలచివేసిందని నాయకులు తెలిపారు. శ్రీనివాస్ మృతి మంచి మిత్రుడిని కోల్పోయిన బాధను మిగిల్చిందన్నారు. ఇటీవలి కాలంలో గుండెపోటుతో పలువురు మృతి చెందుతున్న నేపథ్యంలో అత్యవసర గుండె వైద్యం అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
చెన్నూరు పరిసర ప్రాంతాల్లోని అనేక గ్రామాల ప్రజలు వైద్యం కోసం చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిపై ఆధారపడుతున్నారని, అయితే అవసరమైన వైద్య పరికరాలు, అత్యవసర చికిత్సా సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి విషమంగా మారుతోందని తెలిపారు. గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో రోగులను కరీంనగర్, హైదరాబాద్‌కు తరలించేలోపే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయినా, అవసరమైన పరికరాలు, వైద్య సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోతే ప్రజలకు ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఆసుపత్రిలో అత్యవసర గుండె వైద్యం, అవసరమైన వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చెన్నూరు నియోజకవర్గ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకోవాలని నాయకులు కోరారు. ఓటు వేసిన వారే కాకుండా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఐఎఫ్‌టీయూ డివిజన్ నాయకులు రమేష్ మాసాని మాట్లాడుతూ చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన వైద్య పరికరాలను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రైతుల కోసం, కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేశామని, ప్రజల ప్రాణాలకు సంబంధించిన వైద్య సౌకర్యాల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి రాకముందే ప్రభుత్వం స్పందించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం డివిజన్ నాయకులు సుంకరి కిష్టయ్య, ఐఎఫ్‌టీయూ నాయకులు కోటపల్లి మండలానికి చెందిన అర్జున్ గుట్ట జనక పోశం, అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు కడాల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సౌకర్యాలను తక్షణమే బలోపేతం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని నాయకులు డిమాండ్ చేశారు.