ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 7:53 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

అయ్యాకొడుకుల పాలనలో అభివృద్ధి ఎక్కడ?

అయ్యాకొడుకుల పాలనలో అభివృద్ధి ఎక్కడ?

శాత్రాజ్‌పల్లిలో ఇళ్ల కూల్చివేతపై పుట్ట మధూకర్ ఆగ్రహం.

  • ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చడంపై ప్రశ్నలు,
  • అధికారుల తీరుపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్,
  • నాడు లద్నాపూర్‌.. నేడు శాత్రాజ్‌పల్లి అంటూ మాజీ ఎమ్మెల్యే విమర్శలు.

అర్జున్ సమాచారం // అక్టోబర్ 15 // మంథని డెస్క్:

మంథని నియోజకవర్గంలో దుద్దిళ్ల కుటుంబం నాలుగు దశాబ్దాలుగా అధికారంలో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. మల్హర్ మండలం తాడిచర్ల గ్రామపంచాయతీ పరిధిలోని శాత్రాజ్‌పల్లిలో అర్ధరాత్రి ఇళ్ల కూల్చివేతలు చేపట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలకు గురైన ఇళ్లను పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా అధికారుల చర్యలపై ప్రశ్నలు లేవనెత్తుతూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలేంటి?

ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ, అక్రమ నిర్మాణాల పేరుతో ఇళ్లను కూల్చివేయాల్సి వస్తే ముందుగా సంబంధిత కుటుంబాలకు నోటీసులు జారీ చేసి, నిబంధనలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అర్ధరాత్రి వేళ ఇళ్లను కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల హక్కులు, వారి అభిప్రాయాలు, ఆవేదనలకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కుటుంబం అధికారంలో ఉన్నప్పటికీ మంథని నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు ఆశించిన అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆయన ఆరోపించారు. శాత్రాజ్‌పల్లిలో కనీస మౌలిక సదుపాయాలు, రహదారి సౌకర్యాల కల్పనలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు. ఇళ్ల కూల్చివేతలకు సంబంధించి ముందస్తు నోటీసులు ఎందుకు ఇవ్వలేదో, ఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారో సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని, ఈ అంశంపై మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు.

నాడు లద్నాపూర్‌.. నేడు శాత్రాజ్‌పల్లి

గతంలో లద్నాపూర్‌లో ఇళ్ల కూల్చివేతల కారణంగా పేద కుటుంబాలు నష్టపోయాయని పుట్ట మధూకర్ గుర్తుచేశారు. అప్పులు చేసి, కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇళ్లు నిర్మించుకున్న పేదలు వాటిని కోల్పోతే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. లద్నాపూర్‌ బాధితులకు పరిహారం ఇప్పించినట్లు పేర్కొంటూ, ఇంకా పెండింగ్‌లో ఉన్న పరిహారం, ప్యాకేజీలకు సంబంధించి గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.

శాత్రాజ్‌పల్లిలో గనుల విస్తరణకు సంబంధించి ముందస్తు సమాచారం, నోటిఫికేషన్‌ ఇవ్వలేదని స్థానికులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. గనుల కార్యకలాపాలకు సంబంధించి ఇళ్ల నిర్మాణాలపై ఆంక్షలు ఉంటే వాటిని ముందుగానే ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే సంబంధిత చట్టాలు, నిబంధనలను వివరించి, చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని సూచించారు.

బాధితులకు న్యాయం చేయాలి

శాత్రాజ్‌పల్లిలో జరిగిన ఇళ్ల కూల్చివేతలపై సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించాలని పుట్ట మధూకర్ కోరారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌, పోలీసు అధికారులు ఈ ఘటనపై దృష్టి సారించి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కూల్చివేతల వల్ల నష్టపోయిన ఇళ్లకు, వాటి నిర్మాణాలకు సంబంధించిన నష్టాన్ని అంచనా వేసి నిబంధనల ప్రకారం తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

పేద కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇళ్ల కూల్చివేతలతో నిరాశ్రయులైన లేదా ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాల సమస్యలను పరిష్కరించి, వారికి తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పుట్ట మధూకర్ పేర్కొన్నారు.