అగ్నివీర్ కల నెరవేరేనా?.. కుమారుడిని రప్పించాలంటూ తల్లి వేడుకోలు..
జగిత్యాల ప్రతినిధి ::
అర్జున్ సమాచారం జులై 24::
భారత సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న ఓ యువకుడి కల ప్రస్తుతం గల్ఫ్‌లో చిక్కుకుపోయింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాత గూడూరు గ్రామానికి చెందిన కొపర్తి అభిలాష్ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ఫిజికల్ స్క్రీనింగ్‌కు ఎంపికైనా, ప్రస్తుతం యూఏఈ రాజధాని అబుదాబిలో ఉద్యోగంలో ఉండటంతో స్వదేశానికి రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తన కుమారుడిని అత్యవసరంగా భారత్‌కు రప్పించాలని కోరుతూ అతని తల్లి సుమలత హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ కార్యక్రమాన్ని ఆశ్రయించారు.
జగిత్యాలలోని లైసెన్సు కలిగిన గల్ఫ్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా ఈ నెల 8న టూరిస్ట్ వీసాపై అభిలాష్ అబుదాబికి వెళ్లాడు. అనంతరం జూలై 13న అతనికి ఎంప్లాయిమెంట్ వీసా జారీ అయింది. అయితే జూలై 14న భారత సైన్యం నిర్వహిస్తున్న అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో భాగంగా నిర్వహించే ఫిజికల్ స్క్రీనింగ్‌కు షార్ట్‌లిస్ట్ అయినట్లు ఈ-మెయిల్ రావడంతో స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కానీ ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం వీసా రద్దు చేయాలంటే 4,100 యూఏఈ దిర్హాములు, అంటే సుమారు రూ.1.08 లక్షల జరిమానా చెల్లించాలని షరతు విధించిందని, రిక్రూటింగ్ ఏజెంట్ కూడా అదే విషయాన్ని చెబుతున్నాడని అభిలాష్ తల్లి సుమలత ఆవేదన వ్యక్తం చేశారు. అంత పెద్ద మొత్తాన్ని చెల్లించే ఆర్థిక స్థోమత తమకు లేదని, దీంతో తన కుమారుడు అగ్నివీర్ అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని ఆమె వాపోయారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ బేగంపేట ప్రజా భవన్‌లో నిర్వహించిన ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని తన కుమారుడిని అత్యవసరంగా అబుదాబి నుంచి స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు.
వినతిని స్వీకరించిన ‘సీఎం ప్రజావాణి’ స్టేట్ నోడల్ ఆఫీసర్ కె. విద్యాసాగర్ వెంటనే స్పందించి, పేద కుటుంబానికి చెందిన యువకుడికి అవసరమైన సహాయం అందించి అత్యవసరంగా భారత్‌కు రప్పించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జీఏడీ)కి లేఖ రాశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి బాధిత కుటుంబానికి మార్గదర్శనం చేయగా, హెల్ప్‌డెస్క్ లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, వాలంటీర్ గంగుల మురళీధర్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం అభిలాష్‌కు అగ్నివీర్ అవకాశం దక్కేలా ప్రభుత్వం తీసుకునే చర్యలపై కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు.