36 శాతం లాభాల వాటా కార్మికులకు చెల్లించాలి,వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించాలి.ఆర్జీ-3 జీఎం కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ ధర్నా.
అర్జున్ సమాచారం// అక్టోబర్6// రామగిరి. రిపోర్టర్.
రామగిరి, అక్టోబర్ 6 (అర్జున్ సమాచారం): సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, అందులో 36 శాతం లాభాల వాటాను ఎలాంటి కోతలు లేకుండా కార్మికులకు చెల్లించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు.
ఆర్జీ-3 డివిజన్ జీఎం కార్యాలయం ఎదుట మంగళవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ ఉపాధ్యక్షుడు నాగేల్లి సాంబయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సింగరేణి వాస్తవ లాభాలను ప్రకటించాలని, అందులో 36 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మిరియాల రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని, సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల కాలం పూర్తవుతున్నా ఇప్పటివరకు ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. ఐదు గ్యారెంటీల పేరుతో కార్మికులకు హామీలు ఇచ్చి, ప్రస్తుతం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు.
సింగరేణి ఉన్నతాధికారులకు కూడా తగిన ప్రాధాన్యత లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల సంస్థపై ప్రభావం పడుతోందని ఆయన పేర్కొన్నారు. గతంలో జూన్, జూలై నెలల్లోనే కంపెనీ లాభాలను ప్రకటించేవారని, దసరాకు ముందుగానే కార్మికులకు లాభాల వాటా చెల్లించేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం లాభాలను ప్రకటించడంలో జాప్యం ఎందుకు జరుగుతోందో యాజమాన్యం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
సింగరేణి వాస్తవ లాభాలను ప్రకటించని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి కార్మికుల మద్దతుతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మిరియాల రాజిరెడ్డి హెచ్చరించారు.
అభివృద్ధి పేరిట కోతలు వద్దు
టీబీజీకేఎస్ ఆర్జీ-3 డివిజన్ ఉపాధ్యక్షుడు నాగేల్లి సాంబయ్య మాట్లాడుతూ.. కార్మికులు ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని, ప్రమాదాలను ఎదుర్కొంటూ బొగ్గును వెలికితీసి సంస్థకు లాభాలు తీసుకొస్తున్నారని అన్నారు. అందువల్ల సంస్థకు వచ్చిన లాభాల్లో కార్మికులకు న్యాయమైన వాటా దక్కాలని పేర్కొన్నారు.
2022–23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి రూ.2,222 కోట్ల లాభాలు రాగా, 32 శాతం లాభాల వాటాను కార్మికులకు చెల్లించారని తెలిపారు. 2023–24లో రూ.4,701.3 కోట్ల లాభాలు వచ్చినట్లు పేర్కొంటూ, సంస్థ అభివృద్ధి పేరుతో రూ.2,289 కోట్లు పక్కన పెట్టి, కార్మికులకు రూ.2,412 కోట్లు మాత్రమే పంపిణీ చేశారని అన్నారు.
అదేవిధంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.6,394 కోట్ల లాభాలు వచ్చినప్పటికీ, సంస్థ అభివృద్ధి పేరిట రూ.4,034 కోట్లు పక్కన పెట్టి, మిగిలిన మొత్తంలో నుంచి కార్మికులకు రూ.2,360 కోట్లు మాత్రమే పంపిణీ చేశారని తెలిపారు. 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాల్లో కలిపి రూ.6,323 కోట్లు అభివృద్ధి నిధుల పేరుతో పక్కన పెట్టారని, ఆ నిధులను ఏ విధంగా వినియోగించారో కంపెనీ స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.
అభివృద్ధి నిధుల పేరుతో కార్మికుల లాభాల వాటాలో కోతలు విధించకుండా, సింగరేణి వాస్తవ లాభాలను ప్రకటించి 36 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని కోరారు. దసరాకు వారం, పది రోజుల ముందుగానే లాభాల వాటా చెల్లించాలని, జాప్యం జరిగితే కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
గనులు, విభాగాల్లో వినతి పత్రాలు
అంతకుముందు టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి ఆదేశాల మేరకు ఆర్జీ-3 డివిజన్‌లోని అన్ని గనులు, విభాగాల వద్ద మేనేజర్లు, ఉన్నతాధికారులకు నాయకులు వినతి పత్రాలు సమర్పించారు. కార్మికులకు 36 శాతం లాభాల వాటాను ఎలాంటి కోతలు లేకుండా చెల్లించాలని కోరారు.
అనంతరం నాయకులు ర్యాలీగా జీఎం కార్యాలయానికి చేరుకుని ఆర్జీ-3 జీఎం సుంకర మధుసూదన్, ఏఎల్‌పీ జీఎం కొలిపాక నాగేశ్వరరావులకు వినతి పత్రాలు అందజేశారు. వినతులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని జీఎంలు హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ కేంద్ర, డివిజన్ నాయకులు పింగిలి సంపత్ రెడ్డి, దేవ శ్రీనివాస్, ఈసంపల్లి రమేష్, గట్టు శ్రీనివాస్, బోయినపల్లి శ్రీకాంత్ రావు, అల్లం తిరుపతి, దాసరి మల్లేష్, బొట్ల శివశంకర్, గీటుకు శ్రీనివాస్, భోగం పూర్ణాకర్, దేవరకొండ తిరుపతి, పూసాల శేఖర్, గొర్రె క్రాంతి యాదవ్, కొప్పుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.