హైదరాబాద్,అర్జున్ సమాచారం:
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు అనుముల కొండల్‌రెడ్డికి చెందిన సంస్థకు కేటాయించిన భూములను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం గురువారం క్షేత్రస్థాయిలో సందర్శించింది. భూముల కేటాయింపు జరిగిన ప్రాంతానికి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు అక్కడి నుంచే మీడియాతో మాట్లాడి ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు చేశారు.
రూ.200 కోట్ల విలువైన భూమిని రూ.7 కోట్లకే కేటాయించారంటూ ఆరోపణ,
సుమారు రూ.200 కోట్ల విలువైన ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కేవలం రూ.7 కోట్లకే కేటాయించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టారని విమర్శించారు. విలువైన ప్రభుత్వ భూముల కేటాయింపుపై సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి అన్నదమ్ములకు నో రూల్స్ అంటూ కేటీఆర్ విమర్శలు
అనుముల బ్రదర్స్ భూ వ్యవహారంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. లక్ష రూపాయల చెల్లింపు మూలధనంతో, కనీసం ఒక్క ఉద్యోగి కూడా లేని సంస్థకు ఇంత విలువైన రక్షణ రంగ ప్రాజెక్టు భూమిని ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ఒక రకమైన నిబంధనలు, సామాన్య ప్రజలకు మరో రకమైన నిబంధనలు అమలు చేస్తున్నారనే భావన కలుగుతోందని విమర్శించారు.
ఫోర్త్ సిటీ అభివృద్ధి పేరుతో భూముల దందా:
హరీశ్‌రావు
ఫోర్త్ సిటీ అభివృద్ధి పేరుతో వెనుకబడిన ప్రాంతాల భూములను ప్రభుత్వం సేకరిస్తూ, వాటిని సంస్థల ముసుగులో వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. షెల్ కంపెనీల పేరుతో బంధువుల రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారని విమర్శించారు.
ప్రభుత్వ భూముల కేటాయింపులు, వాటి వెనుక ఉన్న వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. నిరుపేదల భూములు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పోరాటాలు కొనసాగించడంతో పాటు న్యాయపరంగానూ ముందుకు వెళ్తుందని వారు స్పష్టం చేశారు.
=============================

