ePaper
Tuesday, November 24, 2026
ePaper
Homeసినిమాసంగీత రంగంలోకి అడుగు పెట్టిన నిహారిక కొణిదెల

సంగీత రంగంలోకి అడుగు పెట్టిన నిహారిక కొణిదెల

📰 Generate e-Paper Clip

జాతీయ అవార్డ్ అందుకున్న నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ తన క్రియేటివ్ ప్రయాణాన్ని మరింతగా విస్తరిస్తూ ప్రత్యేకంగా మ్యూజిక్ ఛానల్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా వార్నర్ మ్యూజిక్ గ్రూప్‌కు చెందిన డివో మ్యూజిక్‌తో కలిసి గ్యాని సంగీతం అందించిన పాటలను విడుదల చేయనున్నారు.
డిజిటల్ స్టోరీటెల్లింగ్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని చాలామందికి గుర్తించకముందే ఆ దిశగా అడుగులు వేసిన నిహారిక కొణిదెల.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌ను ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న నిర్మాణ సంస్థగా తీర్చిదిద్దారు. ఇప్పటివరకు సినిమాలు, వెబ్ కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఈ సంస్థ.. ఇప్పుడు మరో కొత్త రంగంలోకి అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా ‘పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్’ పేరుతో ప్రత్యేక మ్యూజిక్ ఛానల్‌ను ప్రారంభించారు.  ఈ కొత్త ప్రయాణానికి నిహారిక నిర్మిస్తోన్న రాబోయే తెలుగు సినిమా ‘పాకెట్ రాకెట్స్’ ఆల్బమ్‌తో శ్రీకారం చుట్టనున్నారు. గ్యాని సంగీతం అందించిన ఈ సినిమా ఆల్బమ్ హై ఎనర్జీతో ఆకట్టుకోనుంది. పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తొలి మ్యూజికల్ ప్రాజెక్ట్ ఇదే.
2015లో ప్రారంభమైన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్.. మొదట డిజిటల్ రంగంలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తెలుగులో తొలి వెబ్ సిరీస్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘ముద్దపప్పు ఆవకాయ్‌’తో ఈ సంస్థ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ‘నాన్న కూచి’, ‘మ్యాడ్ హౌస్‌’, ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, ‘హలో వరల్డ్‌’, ‘బెంచ్ లైఫ్‌’ వంటి పలు వెబ్ సిరీస్‌లు, డిజిటల్ ప్రాజెక్టులను నిర్మించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌కు ‘కమిటీ కుర్రోళ్లు’ మంచి విజయాన్ని అందించింది. కొత్త దర్శకుడు యదు వంశీ తెరకెక్కించిన ఈ సినిమా.. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.నిర్మాతగా నిహారిక కొణిదెల ప్రతిభకు కూడా పలు అవార్డులు దక్కాయి. SIIMA 2025, GAMA 2025 వేడుకల్లో ఉత్తమ తొలి చిత్ర నిర్మాతగా ఆమె అవార్డులు అందుకున్నారు. ఇక ‘రాకాస’ సినిమాతో తన నిర్మాణ ప్రయాణాన్ని మరింత విస్తరించారు. కొత్త కథలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే, వారి అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలు అందించడమే లక్ష్యంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ముందుకు సాగుతోంది.
పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్‌ను ప్రారంభించ‌టం.. నిహారిక కొణిదెల ప్రయాణంలో మరో కీలక అడుగుగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు సినిమా నిర్మాణానికే పరిమితమైన ఈ సంస్థ.. ఇకపై తన సినిమాల్లోని పాటలు, సంగీతానికి కూడా ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తోంది. ఈ కొత్త మ్యూజిక్ ఛానల్ నుంచి మొదటి ఆల్బమ్‌గా ‘పాకెట్ రాకెట్స్’ పాటలు విడుదల కానున్నాయి. గ్యాని సంగీతం అందించిన ఈ ఆల్బమ్‌ను వార్నర్ మ్యూజిక్ గ్రూప్‌కు చెందిన డివో మ్యూజిక్ భాగస్వామ్యంతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇలా నిర్మాణ సంస్థ, సంగీత దర్శకుడు, ప్రముఖ మ్యూజిక్ సంస్థ కలిసి ఈ కొత్త ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నారు. దీంతో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ వినోద రంగంలో మరో కొత్త ప్ర‌యాణాన్ని ప్రారంభించిన‌ట్ల‌య్యింది.
రుద్ర ఆత్రి రచించి  దర్శకత్వం వహిస్తోన్న‌ ‘పాకెట్ రాకెట్స్’ ఓ అర్బన్ డ్రామాగా తెరకెక్కుతోంది. అంజి, యేసు అనే ఇద్దరు యువకుల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. జీవితంలో తమ పరిస్థితులను మార్చుకోవాలనే ఆశతో, తమ కలలను నిజం చేసుకునే ప్రయత్నంలో వీరిద్దరూ జూద ప్రపంచంలోకి అడుగుపెడతారు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయన్నదే సినిమా కథాంశం. ఈ చిత్రంలో త్రినాధ్ వర్మ, నిర్మల్, శ్రియ కొంతం, జేడీ చక్రవర్తి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై నిహారిక కొణిదెల సమర్పణలో, మాగ్జిమం సిటీ స్టూడియోస్‌తో కలిసి ఈ సినిమా రూపొందుతోంది. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. రమేష్ మ‌న్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అన్వర్ అలీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్ ప్రారంభంతో నిహారిక కొణిదెల తన నిర్మాణ సంస్థను మరో కొత్త దిశగా తీసుకెళ్తున్నారు. ఇప్పటివరకు సినిమాల ద్వారా కథలను ప్రేక్షకులకు చేరువ చేసిన ఈ సంస్థ.. ఇకపై సంగీతం ద్వారా కూడా తన క్రియేటివిటీని మరింత మందికి పరిచయం చేయాలని చూస్తోంది. ఈ కొత్త ప్రయాణంలో ‘పాకెట్ రాకెట్స్’ తొలి అడుగుగా మారింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 11న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!