పిల్లలపై తల్లిదండ్రుల నిరంతర పర్యవేక్షణ అవసరం .డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.. విద్యార్థులు లక్ష్యసాధనపై దృష్టి సారించాలి.
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 11:
పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా వారిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ అన్నారు. మంథని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం నూతన విద్యార్థుల కోసం నిర్వహించిన పరిచయ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ బి.విష్ణువర్ధన్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ మడత రమేష్, సింగరేణి సంస్థ ఆర్జీ-3 జనరల్ మేనేజర్ మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్టు జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలపై నిత్యం కన్నేసి ఉంచాలని, వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని సూచించారు. పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని సమర్థించకుండా, తప్పును గుర్తించి సరిదిద్దే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలన్నారు. విద్యార్థులు చదువుపైనే ప్రధానంగా దృష్టి సారించాలని, ఇతర అనవసర వ్యవహారాల్లో తలదూర్చవద్దని సూచించారు. పిల్లల చర్యల కారణంగా తల్లిదండ్రులు చట్టం ముందు దోషులుగా నిలబడే పరిస్థితి రాకుండా జాగ్రత్త వహించాలని హితవు పలికారు. ముఖ్యంగా మాదకద్రవ్యాల వంటి చెడు వ్యసనాల జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దానిని సాధించేందుకు సరైన మార్గాన్ని ఏర్పరచుకోవాలని, గమ్యం తప్పకుండా ముందుకు సాగాలని అన్నారు. కళాశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని చక్కటి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. మంథని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలకు మంచి పేరు ఉందని, అదే పేరును భవిష్యత్తులోనూ కొనసాగించేలా విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని కోరారు. కళాశాల పరిసర ప్రాంతాలపై పోలీసుల ప్రత్యేక నిఘా ఉంటుందని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎం.ఉదయ్ కుమార్ పవర్ ప్రజెంటేషన్ ద్వారా హాజరు, క్రెడిట్లు, పరీక్షలు, వివిధ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది.

