హైదరాబాద్,అర్జున్ సమాచారం:
హిందూ ముస్లింల మధ్య నాకు వ్యత్యాసం లేదు. హిందూ – ముస్లింలు ఇద్దరూ నాకు రెండు కళ్లలాంటి వారు” అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన అభ్యర్థులు తెలంగాణ రైజింగ్ కోసం పనిచేయాలని పిలుపనిచ్చారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ మైనారిటీల ప్రతిభా సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గ్రూప్ 1, 2, 3, 4 తదితర కేటగిరీల్లో జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఎంపికైన, అలాగే నీట్, ఐఐటీ, ఎన్ఐటీ లాంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 782 మంది మైనారిటీ అభ్యర్థులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ , మహమ్మద్ అజారుద్దీన్ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ , TGMREIS ప్రెసిడెంట్ మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషిరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. “చదువొక్కటే మన భవిష్యత్తును మార్చుతుంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు చదువుకోవాలి. ఆ తర్వాత నుంచి విద్యార్థులు స్కిల్స్ పై దృష్టి సారించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో స్కిల్స్ ఉంటే ఉద్యోగావకాశాలకు కొదవలేదు. స్కిల్స్ ఉన్నవారికి జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఎన్నో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. స్కిల్స్‌లో యువతను సిద్ధం చేయాలన్న లక్ష్యంతోనే ఐటీఐలను ఏటీసీలుగా మార్పు చేశాం. పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చాం. నైపుణ్యం ఉంటే భవిష్యత్తు మారుతుంది. ఎంతో కష్టపడుతున్న చిన్న చిన్న కుటుంబాల నుంచి ఎంతగానే కృషి చేసి ఈ ఉద్యోగాలు సాధించుకున్న మీ అందరికీ అభినందనలు. మైనారిటీలకు కల్పించిన 4 శాతం రిజర్వేషన్లను తొలగించాలన్న ప్రయత్నాలు జరిగాయి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. సంక్షేమ కార్యక్రమాల్లో మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వల్ల మైనారిటీలకే ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ -1 తో పాటు ఉద్యోగ నియామకాలేవీ జరగలేదు. గ్రూప్ – 1 కు సంబంధించి ఒకసారి ప్రయత్నం జరిగినప్పటికీ పల్లీ బఠానీల్లా పరీక్షా పత్రాలను మార్కెట్ లో విక్రయించారు. గ్రూప్ -1, 2 లాంటి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయాలంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో అర్హత కలిగిన వారు సభ్యులుగా ఉండాలి. అనామకులను సర్వీసు కమిషన్‌లో నియమించారు.
ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌తో పాటు నిపుణులతో సమాలోచనలు జరిపి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేశాం. రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను అడ్డుకోవాలని అనేక అడ్డంకులు సృష్టించారు. మీరంతా మా కుటుంబ సభ్యులుగా భావించి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఉద్దండులైన న్యాయవాదులను నియమించి పోరాటం చేసి నియామకాలను పూర్తి చేశాం” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
==============================

