పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 13:రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. గ్రామానికి సమీపంలోని ఓసీపీ-2 క్వారీలో జరుగుతున్న బ్లాస్టింగ్ పనులను అడ్డుకుని క్వారీని ముట్టడించారు. తమ గ్రామంలోని నిర్వాసిత కుటుంబాల సమస్యలను పరిష్కరించకుండా బ్లాస్టింగ్ పనులు చేపట్టడం సరికాదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజాపూర్ గ్రామానికి సంబంధించి పునరావాసం, పరిహారం విషయంలో అధికారులు సమన్యాయం చేయడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. మొత్తం 122 ఇళ్లకు ఇప్పటివరకు పీడీ ఇవ్వలేదని, దీంతో ఆయా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఒకే విధమైన న్యాయం జరగాలని, ఆర్టిహెచ్, ఆర్పిహెచ్ పేర్లతో కుటుంబాలను వేర్వేరుగా చూడకుండా అందరికీ సమాన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
తమ సమస్యలు పరిష్కరించకుండా క్వారీలో బ్లాస్టింగ్ పనులు కొనసాగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఓసీపీ-2 క్వారీ వద్దకు చేరుకున్నారు. బ్లాస్టింగ్ పనులను నిలిపివేయించి అక్కడే నిరసన చేపట్టారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీగా మోహరించి గ్రామస్తులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. తమ కుటుంబాల భవిష్యత్తుతో ముడిపడిన సమస్యను అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. 122 ఇళ్లకు పీడీ ఇవ్వకుండా బ్లాస్టింగ్ పనులు నిర్వహిస్తే తమ ఇళ్లు, ఆస్తులు, జీవనోపాధికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
కలెక్టర్ హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తాం
రాజాపూర్ గ్రామంలోని ఆర్టిహెచ్, ఆర్పిహెచ్ కుటుంబాలను వేర్వేరుగా పరిగణించకుండా అందరికీ సమన్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టమైన హామీ ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కలెక్టర్ స్వయంగా హామీ ఇచ్చే వరకు తమ దీక్షను విరమించేది లేదని తేల్చిచెప్పారు. బ్లాస్టింగ్ పనులను నిలిపివేసి ముందుగా గ్రామస్తుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. గ్రామస్తుల ఆందోళనతో ఓసీపీ-2 క్వారీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

