వేములవాడ,అర్జున్ సమాచారం:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలోని లడ్డు కౌంటర్‌ను దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఈవో ఎల్. రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా లడ్డు, పులిహోర ప్రసాదాల నాణ్యతను పరిశీలించి, భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు అందేలా ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే కౌంటర్లలో పారిశుద్ధ్య పరిస్థితులు, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
అదేవిధంగా, లడ్డు, పులిహోర ప్రసాదాలను కొనుగోలు చేసిన భక్తులను, చిన్నపిల్లలను స్వయంగా పలకరించి ప్రసాదాల నాణ్యత ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ప్రసాదాల నాణ్యతపై భక్తుల అభిప్రాయాలను తెలుసుకుంటూ, వారి సూచనలను సైతం స్వీకరించారు.
డ్యూటీలో గైర్హాజరైన సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించిన ఈవో, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటర్ సిబ్బంది భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్న సిబ్బంది తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటిస్తూ ఐడీ కార్డు ధరించాలని సూచించారు.
ఈ తనిఖీలలో డీఈఓ నవీన్ కుమార్, ఏఈఓ జయకుమారి, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి పీఆర్ఓ పెరిక శ్రీనివాస్, పర్యవేక్షకులు వెల్ది సంతోష్, నులిగొండ రాజేందర్, జూనియర్ అసిస్టెంట్ అజయ్‌తో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
=============================

