గంజాయి వినియోగానికి బానిసైన 10 మంది యువకులకు పరీక్షలు – పునరావాస కేంద్రానికి తరలింపు.
భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 02.
భీమారం: గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా భీమారం మండలంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గంజాయి వినియోగానికి అలవాటు పడిన 10 మంది యువకులను గుర్తించి, వారికి గంజాయి వినియోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో గంజాయి వినియోగించినట్లు నిర్ధారణ కావడంతో, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సంబంధిత పునరావాస (Rehabilitation) కేంద్రానికి తరలించి చికిత్స మరియు కౌన్సెలింగ్ అందించే విధంగా చర్యలు చేపట్టారు.
యువత మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా లేదా విక్రయాలపై సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జైపూర్ ACP శ్రీ A. వెంకటేశ్వర్ గారు, జైపూర్ CI శ్రీ నవీన్ కుమార్ గారు మరియు భీమారం SI శ్రీ A. రాజేందర్ గారు పాల్గొన్నారు.
“మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి – ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కండి” అని పోలీసులు పిలుపునిచ్చారు.

