సింగరేణిలో ‘మారుపేర్ల’ సమస్య పరిష్కారానికి మానవీయ కోణంలో ప్రభుత్వం పరిశీలిస్తుంది:
శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.
హైదరాబాద్ అర్జున్ సమాచారంప్రతినిధిసెప్టెంబర్7.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ‘మారుపేర్ల’ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ శాసనమండలిలో స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ ఇచ్చే సిఫార్సుల ఆధారంగా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
శాసనమండలి సమావేశాల్లో ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇది ఇటీవల ఉత్పన్నమైన సమస్య కాదని, 1990వ దశకంలో అనగా 1997 నుంచే సింగరేణిలో కొనసాగుతున్న పాత (లెగసీ) సమస్య అని వివరించారు. అధికారిక రిజిస్టర్‌లో ఒకరి పేరు ఉంటే, వారి స్థానంలో మరొకరు వచ్చి విధుల్లో పనిచేస్తున్న పరిస్థితులు ఉండేవి. చట్టప్రకారం ఒకరి పేరు మీద మరొకరు ఉద్యోగం చేయడం తీవ్రమైన నేరపూరితమైన అంశమైనప్పటికీ, కార్మికుల పరిస్థితిని అర్థం చేసుకొని సింగరేణి యాజమాన్యం గతంలో మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రయత్నించిందని గుర్తుచేశారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆ సమయంలో 45 మంది అధికారులతో పాటు సంబంధిత వ్యక్తులపైనా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
సింగరేణిలో ప్రస్తుతం దాదాపు 90 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ఈ మారుపేర్ల సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య కేవలం 128 మాత్రమేనని భట్టి విక్రమార్క తెలిపారు. ఇది భారీ సంఖ్యలో ఉన్న పెద్ద సమస్య కాకపోయినప్పటికీ, చట్టపరమైన చిక్కులు ఉన్నందున అధికారులు ఈ సమస్యను పరిష్కరించేందుకు భయపడుతున్నారని చెప్పారు.
ఒకవైపు నిబంధనల ప్రకారం భవిష్యత్తులో చర్యలు ఉంటాయనే అధికారుల భయం, మరోవైపు ఈ సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న ఒత్తిడిని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించిందని తెలిపారు. కార్మికులు చాలా ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్నందున, ఏ ఒక్క అధికారిపైనా భారం పడకుండా కమిటీ ద్వారా మానవీయ కోణంలో సమగ్రంగా పరిశీలించాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే నియమించిన కమిటీ నుంచి నివేదిక రాగానే సదరు 128 మంది మారుపేర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు.

