రామప్పను కబళిస్తున్న మైనింగ్
వరంగల్, సెప్టెంబర్ 11, (అర్జున్ సమాచారం ప్రతినిధి.)
ములుగు జిల్లాలో ప్రతిపాదించిన ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల ప్రాజెక్టుపై స్థానికులు, పర్యావరణవేత్తలు, వారసత్వ పరిరక్షణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రఖ్యాతి గాంచిన రామప్ప ఆలయంతో
పాటు 3 టీఎంసీల సామర్థ్యం ఉన్న రామప్ప చెరువుపై మైనింగ్ ప్రభావం చూపే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ అభ్యంతరాల నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టర్ ప్రతిపాదిత ప్రాజెక్టు
జియో ట్యాగింగ్ ప్రక్రియను వాయిదా వేశారు. శాస్త్రీయ, పర్యావరణ అధ్యయనాల అనంతరం నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన
తెలంగాణలోని చారిత్రక రామప్ప ఆలయానికి సమీపంలో ప్రతిపాదిత ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల ప్రాజెక్టు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో చేపట్టాలని
ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు వల్ల రామప్ప ఆలయంతో పాటు 3 టీఎంసీల సామర్థ్యం ఉన్న రామప్ప చెరువుపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని గ్రామస్తులు, పర్యావరణవేత్తలు, వారసత్వ
పరిరక్షణ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్థానికులు, పాలంపేట స్పెషల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పీఎస్‌డీఏ) కమిటీ సభ్యులు, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్
(కేహెచ్‌టీ) ప్రతినిధులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ములుగు జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవ్‌రావు భోర్కడే మంగళవారం ప్రతిపాదిత మైనింగ్ ప్రాజెక్టు జియో ట్యాగింగ్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు
ప్రకటించారు. మైనింగ్ ప్రాజెక్టుపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కలెక్టర్ హేమంత్.. శాస్త్రీయ, పర్యావరణపరమైన అంచనాలు పూర్తి అయిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని
స్పష్టం చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.ఈ అంశంపై నిర్వహించిన సమావేశాల్లో జిల్లా యంత్రాంగంతో పాటు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్), కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, పీఎస్‌డీఏ
కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రామప్ప ఆలయం , చెరువు, పరిసర గ్రామాలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశాన్ని సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని వారసత్వ పరిరక్షణ
వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపాదిత ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌ను కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కన్వీనర్, మాజీ ప్రొఫెసర్ ఎం. పాండురంగారావు వ్యతిరేకించారు. గనుల తవ్వకాల కోసం బ్లాస్టింగ్, డ్రిల్లింగ్, భారీ యంత్రాల
వినియోగం చేపడితే రామప్ప చెరువు నిర్మాణంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.రామప్ప చెరువుకు సుమారు 3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉందని.. దాని
నిర్మాణానికి ఏదైనా నష్టం జరిగితే దిగువ ప్రాంతాల్లోని గ్రామాలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని పాండురంగారావు పేర్కొన్నారు. చెరువుకు సుమారు 5 కిలోమీటర్ల పరిధిలో మైనింగ్ కార్యకలాపాలు
చేపట్టడం కూడా పలు ప్రమాదాలకు దారితీయవచ్చని.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని కోరారు.ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాంతంలో సుమారు 40.4 మిలియన్ టన్నుల బొగ్గును
వెలికితీసేందుకు సింగరేణి గతంలో అనుమతులు పొందినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇందుకోసం 19 ఏళ్ల మైనింగ్ లీజు కూడా పొందినట్లు సమాచారం. ప్రాజెక్టు పరిధిలోని కొంత భూమిని
సంస్థ ఇప్పటికే సేకరించి.. భూయజమానులకు పరిహారం చెల్లించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ ప్రాజెక్టులో సుమారు 314 హెక్టార్ల అటవీ భూమి.. మరో 1,448 హెక్టార్ల వ్యవసాయ,
ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉన్నట్లు పేర్కొంటున్నారు. దీంతో మైనింగ్ వల్ల పర్యావరణంతో పాటు స్థానికుల జీవనోపాధిపై కూడా ప్రభావం ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఈ ప్రాజెక్టుకు
సంబంధించిన ప్రతిపాదనలు 2021 జూలైకి ముందే సమర్పించగా.. అదే ఏడాది డిసెంబర్లో మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలనే ప్రణాళిక ఉన్నట్లు సమాచారం. కానీ.. 2021 జూలై 25వ తేదీన
రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా లభించింది. దీంతో పాలంపేట, పరిసర గ్రామాల ప్రజలు ఆలయ పరిరక్షణ కోసం సేవ్ రామప్ప ఉద్యమాన్ని ప్రారంభించారు. స్థానికులు, వారసత్వ
పరిరక్షణ కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సింగరేణి ఈ ప్రాజెక్టును అప్పట్లో నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టును తిరిగి ముందుకు తీసుకెళ్లే అంశంపై చర్చలు
మొదలవడంతో పాలంపేట, పరిసర గ్రామాల ప్రజలు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రామప్ప ఆలయం, చెరువు, అటవీ ప్రాంతం, స్థానిక పర్యావరణ వ్యవస్థను కాపాడాలని డిమాండ్
చేస్తున్నారు.

