• రైతులను ఆయిల్ పామ్ వైపు ప్రోత్సహిస్తూ.. అదే రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధానాలు ఎందుకు?
• దిగుమతి సుంకం తగ్గింపుతో దేశీయ ఆయిల్ పామ్ రైతులకు ధరలపై ఒత్తిడి పడే అవకాశం
• రాష్ట్రం 44 శాతం దిగుమతి సుంకం కోరుతుంటే.. కేంద్రం 16.5 శాతం నుంచి 11 శాతానికి తగ్గించింది
• కేంద్ర నిర్ణయం ఆయిల్ పామ్ రైతుల్లో అనిశ్చితిని పెంచే అవకాశం
• దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే పునరాలోచించాలి
• రైతులను ఆయిల్ పామ్ వైపు మళ్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు
• రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు కేంద్ర దిగుమతి సుంకం తగ్గింపు ప్రతికూలంగా మారే అవకాశం
ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముడి పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు దేశంలో ఆయిల్ పామ్ సాగును విస్తరించాలని, రైతులను ఈ పంట వైపు మళ్లించాలని రాష్ట్రాలకు సూచిస్తూ.. మరోవైపు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్‌పై సుంకాన్ని తగ్గించడం కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరికి నిదర్శనమని మంత్రి మండిపడ్డారు.
“రైతును ఆయిల్ పామ్ సాగు చేయమని ప్రోత్సహిస్తారు.. కానీ రైతు పండించిన గెలలకు గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితులను మాత్రం కేంద్రం దెబ్బతీస్తోంది. ఒక చేత్తో రైతును ఆయిల్ పామ్ వైపు నడిపిస్తూ.. మరో చేత్తో దిగుమతి సుంకం తగ్గించి విదేశీ పామాయిల్‌కు మార్కెట్‌ను సులభతరం చేయడం ఏ విధమైన రైతు అనుకూల విధానం?” అని మంత్రి ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో క్రూడ్ పామ్ ఆయిల్‌పై మొత్తం దిగుమతి సుంకం 16.5 శాతం నుంచి 11 శాతానికి తగ్గింది. దీంతో దిగుమతి చేసుకునే పామాయిల్‌కు పోటీ ప్రయోజనం పెరిగి, దేశీయంగా ఆయిల్ పామ్ గెలల ధరలపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
“తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి దిగుమతి సుంకాన్ని పెంచాలని కోరుతున్న సమయంలో కేంద్రం సుంకాన్ని తగ్గించడం బాధ్యతారాహిత్యమైన నిర్ణయం. రైతులకు ధర భరోసా కల్పించాల్సిన సమయంలో విదేశీ దిగుమతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కేంద్రం ఎవరికి ప్రయోజనం కల్పించాలనుకుంటోంది?” అని తుమ్మల ప్రశ్నించారు.
ఆయిల్ పామ్ అనేది సాధారణంగా ఒక సీజన్లో పండించి విక్రయించే పంట కాదని, రైతు సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టి, నీరు, ఎరువులు, నిర్వహణ ఖర్చులు భరిస్తూ సాగు చేసే దీర్ఘకాలిక పంట అని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి పంటకు మార్కెట్ ధరపై విధానపరమైన స్థిరత్వం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
“ఈరోజు మొక్క నాటిన రైతు రేపే పంట అమ్మడు. సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టిన తర్వాత మార్కెట్ విధానాలను మార్చేస్తే నష్టపోయేది రైతే. రైతుకు ధర భరోసా ఇవ్వకుండా, దిగుమతులకు 92తలుపులు మరింత విస్తరించడం రైతు ప్రయోజనాలకు విరుద్ధం” అని మంత్రి స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును రాష్ట్రంలో పెద్ద ఎత్తున విస్తరిస్తోందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 3.20 లక్షల ఎకరాల్లో 88 వేలకుపైగా రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని, దేశంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణంలో తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు.
రైతులను ఆయిల్ పామ్ వైపు మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి రాయితీలు, నాట్ల విస్తరణ, డ్రిప్ ఇరిగేషన్, మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, రిఫైనరీలు వంటి అనేక చర్యలు చేపడుతోందని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం కూడా NMEO-OP ద్వారా దేశీయ ఆయిల్ పామ్ ఉత్పత్తిని పెంచి, వంట నూనెల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రకటించింది.
“కేంద్రం ప్రకటించే లక్ష్యాలు ఒకలా.. అమలు చేసే విధానాలు మరోలా ఉంటే రైతు ఎలా నమ్మకం పెంచుకుంటాడు? ఆయిల్ పామ్ సాగు విస్తరణ కోసం రాష్ట్రాలు, రైతులు పెట్టుబడులు పెట్టిన తర్వాత దిగుమతి సుంకం వంటి కీలక విధానాలను మార్చడం వల్ల రైతుల్లో నమ్మకం దెబ్బతింటుంది” అని తుమ్మల అన్నారు.
ఆయిల్ పామ్ రైతుల దీర్ఘకాలిక డిమాండ్ అయిన తాజా ఆయిల్ పామ్ గెలలకు (FFB) టన్నుకు రూ.25,000 కనీస హామీ ధర కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో FFB ధర ప్రభుత్వం నిర్ణయించే విధానం ప్రకారం అమలవుతోందని, రైతులకు మరింత స్థిరమైన ధర భరోసా అవసరమని పేర్కొన్నారు.
“రైతు ఆదాయం పెంచుతామని చెప్పే కేంద్ర ప్రభుత్వం ముందుగా రైతు పండించిన పంటకు ధర భరోసా కల్పించాలి. విదేశీ దిగుమతులపై ఆధారపడే విధానాన్ని ప్రోత్సహిస్తూ దేశీయ రైతు ఉత్పత్తికి ధర లేకుండా చేయడం ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తికే విరుద్ధం” అని మంత్రి అన్నారు.
భారత్ తన వంట నూనెల అవసరాల్లో పెద్ద భాగాన్ని దిగుమతుల ద్వారా తీర్చుకుంటున్న నేపథ్యంలో, దేశీయ ఆయిల్ పామ్ సాగును బలోపేతం చేయడం కేవలం రైతు సంక్షేమానికే కాకుండా దేశ ఆహార, వ్యవసాయ భద్రతకు కూడా కీలకమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ తన వెజిటబుల్ ఆయిల్ అవసరాల్లో సుమారు మూడింట రెండొంతులు దిగుమతులపై ఆధారపడుతున్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.
“ఆత్మనిర్భర్ భారత్ అంటే విదేశీ దిగుమతులపై ఆధారపడటం కాదు.. దేశ రైతు ఉత్పత్తి చేసే నూనెను పెంచడం. రైతును బలోపేతం చేయకుండా దిగుమతులను చౌక చేయడం ద్వారా దేశం ఆత్మనిర్భర్ కాదు. దేశీయ రైతు నిలబడితేనే దేశం నిలబడుతుంది” అని తుమ్మల స్పష్టం చేశారు.
తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి కేంద్రం సహకరించాల్సింది పోయి, రైతుల్లో అనిశ్చితి కలిగించే నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. “తెలంగాణ రైతులు నమ్మకంతో ఆయిల్ పామ్ సాగులోకి వచ్చారు. ఆ నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. రైతు ప్రయోజనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీ పడదు. కేంద్రం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించి, దేశీయ ఆయిల్ పామ్ రైతులకు రక్షణ కల్పించే విధానాన్ని తీసుకురావాలి” అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని తక్షణమే పునఃసమీక్షించాలని, దేశీయ ఆయిల్ పామ్ రైతులకు ధర భరోసా కల్పించేలా కేంద్రం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని, లేని పక్షంలో FFBలకు టన్నుకు రూ.25,000 కనీస హామీ ధర కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
==============================

