అర్జున్ సమాచారం:
రాష్ట్ర ప్రజలను ప్రకృతిలో మమేకం చేసి, వారికి మరిచిపోని మధురానుభూతులను ఇవ్వడంతోపాటు, గిరిజనులకు ఎకో టూరిజం జీవనోపాధులు మెరుగుపర్చడం ప్రభుత్వం ముందున్న లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. నల్లమల నుంచి మారేడుమిల్లి వరకు, బాపట్ల తీర ప్రాంత అందాల నుంచి కోటప్పకొండ ఆధ్యాత్మిక ప్రయాణం వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పర్యాటక కళను తీసుకొచ్చేలా పని చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మితమైన 6 నగరవనాలను ఉప ముఖ్యమంత్రి మంగళవారం వర్చువల్ గా ప్రారంభించారు.
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘నగర వన యోజన కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 19 నగరవనాలుంటే, ఇప్పుడు ప్రారంభించిన ఆరు నగరవనాలతో కలిపి 25 నగరవనాలు రాష్ట్రంలో ఏర్పడతాయి. 305 హెక్టార్లలో, రూ.13 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ నగరవనాలు కేవలం మొక్కలు నాటే ప్రాంతాలుగా కాకుండా, ప్రజలను ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్లే మార్గంగా ఉంటాయి. నగరవనాల్లో సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ లు, పిల్లలు ఆడుకునే ప్రాంతాలు, జిమ్ పరికరాలు వంటివి అందుబాటులో ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో, స్వచ్ఛమైన అందాలతో నగరవనాలు ఆరోగ్యం, ఆహ్లాదం, ప్రకృతి అవగాహన కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాం. బాపట్ల, చీరాల తీర ప్రాంత పర్యాటక వనాలుగా ఉంటే, కోటప్పకొండ ఆధ్యాత్మిక సువాసనలతో విరాజిల్లుతుంది. వినుకొండ, దేవరంపాడు, మాచర్లలో ఏర్పాటు చేసే నగరవనాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రకృతికి దగ్గరయితే, ఆరోగ్యం దగ్గరవుతుంది. ప్రకృతి అర్ధమైతే, పరిరక్షణ బాధ్యత పెరుగుతుంది. ఇది ప్రకృతి నియమం.
సత్సంకల్పంతో ముందడుగు వేస్తున్నాం
రాష్ట్రంలో ఎకో టూరిజం పెరగడం వల్ల గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వెలిగోడు జంగిల్ సఫారీతో సరికొత్త అనుభూతులు లభిస్తాయి. మారేడుమిల్లి ట్రెక్కింగ్, ఆరోమా కనోపీ వాక్ ద్వారా తూర్పు కనుమల అటవీ అందాలను, ప్రకృతి పరిమళలను ప్రజలకు చేరువ చేస్తాం. గిరిజన సంస్కృతిని ప్రజలకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తాం. దీనివల్ల గిరిజనుల జీవన విధానంలో మంచి మార్పులు వస్తాయని సత్సంకల్పంతో పని చేస్తున్నాం. ప్రకృతిని ప్రేమించాలి.. భావితరాలకు బహుమతిగా ఇవ్వాలనేది మా సంకల్పం. దీనికి కట్టుబడి పనిచేస్తాం. దీనికి ప్రజలు తమవంతుగా సహకరించాలి’’ అన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ రూపొందించిన వైల్డ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఆఫ్ ద నల్లమల ఫారెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ట్రీ టాన్స్ లోకేషన్ మాన్యూవల్ పుస్తకాలను ఉప ముఖ్యమంత్రివర్యులు ఆవిష్కరించారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ దేశంతోనే మొదటిసారి ‘‘ఈకోలిప్టస్ పల్ప్ ఉడ్ ప్లాంటేషన్’’ విభాగంలో అనుసరిస్తున్న సుస్థిర నిర్వహణ పద్ధతులకు గుర్తింపుగా సాధించిన ప్రమాణ్ సర్టిఫికేట్ ను డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అటవీశాఖ అధికారులు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదల నాగేంద్రబాబు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శీరిష, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, అటవీ, పర్యావరణ శాఖ చీఫ్ సెక్రటరీ కాంతిలాల్ దండే, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ డాక్టర్ చలపతిరావు, అడిషనల్ పీసీసీఎఫ్ రాహుల్ పాండే, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, సీఈవో ఏపీ గ్రీన్ బీఎన్ఎన్ మూర్తి, అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, ఎకో టూరిజం ఈడీ నందిని సలారియా, అటవీశాఖ ఐటీ సలహాదారుల పి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
==========================

