బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.. హక్కుల పరిరక్షణకు సమష్టి కృషి అవసరం.
పోక్సో చట్టం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, సైబర్ భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించిన, సీనియర్ సివిల్ జడ్జి పోరిక రవీందర్.
అర్జున్ సమాచారం. అక్టోబర్ 28. జన్నారం ప్రతినిధి డెస్క్.
ఖానాపూర్: సమాజంలో బాలల హక్కుల పరిరక్షణ, వారి భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, నిర్మల్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పోరిక రవీందర్ పిలుపునిచ్చారు. బాలలపై జరిగే లైంగిక వేధింపులు, దాడులను అరికట్టడంతోపాటు చిన్నారులకు ,సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. బాలలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండటంతోపాటు, ఆపద సమయంలో ఎవరిని సంప్రదించాలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
ఖానాపూర్ ,మండల పరిధిలోని మస్కాపూర్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా న్యాయ, బాలల రక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి పోరిక రవీందర్ విద్యార్థులకు బాలల హక్కులు, చట్టపరమైన రక్షణలు, వ్యక్తిగత భద్రత, సైబర్ నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
పోక్సో చట్టంపై అవగాహన అవసరం.
చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పోక్సో చట్టం–2012 గురించి జడ్జి వివరించారు. ఈ చట్టం బాలలకు కల్పించే రక్షణ, నేరాలకు పాల్పడిన వారికి ఎదురయ్యే శిక్షల తీవ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాలలపై ఎలాంటి అనుచిత ప్రవర్తన జరిగినా దానిని తేలికగా తీసుకోకూడదని, బాధితులు భయంతో మౌనంగా ఉండకుండా విశ్వసనీయమైన పెద్దల సహాయం తీసుకోవాలని సూచించారు. తమకు అన్యాయం జరిగినప్పుడు ధైర్యంగా తెలియజేయాలని, ఇతరులకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనా వారికి అండగా నిలవాలని చెప్పారు.
మంచి స్పర్శ.. చెడు స్పర్శను గుర్తించాలి,
విద్యార్థులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య తేడాను తెలుసుకోవాలని పోరిక రవీందర్ సూచించారు. తమకు అసౌకర్యం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తించినా, అనుచితంగా తాకినా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని స్పష్టం చేశారు. భయంతోనో, బెదిరింపులకు లోనైయో విషయాన్ని దాచిపెట్టకూడదని చెప్పారు. పిల్లల మాటలను పెద్దలు శ్రద్ధగా వినాలని, వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అపరిచితుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
పాఠశాలకు వెళ్లే సమయంలో, తిరిగి ఇంటికి వచ్చే సమయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని జడ్జి సూచించారు. పరిచయం లేని వ్యక్తులు ఇచ్చే తినుబండారాలు, బహుమతులు స్వీకరించకూడదని, వారి వాహనాల్లో లిఫ్ట్ తీసుకోకూడదని హెచ్చరించారు. అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే సమీపంలోని బాధ్యతగల పెద్దలకు లేదా ఉపాధ్యాయులకు సమాచారం అందించాలని తెలిపారు.
సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు సైబర్ భద్రతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, ఇతర సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని చెప్పారు. ఆన్లైన్ గేమింగ్ మోసాలు, సైబర్ బెదిరింపుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద సందేశాలు లేదా లింక్‌లను నమ్మకూడదని హితవు పలికారు. ఇంటర్నెట్ను విద్యా సంబంధిత అవసరాలకు బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు.
ఆపదలో హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలి,
ఆపదలో ఉన్న బాలల రక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098ను సంప్రదించాలని, పోలీసుల అత్యవసర సహాయం కోసం 100 నంబర్‌కు సమాచారం అందించాలని జడ్జి తెలిపారు. బాలల భద్రత కేవలం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.
ఈ అవగాహన సదస్సులో సర్పంచ్ దోనికేని లక్ష్మీ, ఎస్ఐ రాహుల్ గౌక్వాడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాడి శ్రీనివాస్, ఖానాపూర్ బార్ అసోసియేషన్‌కు చెందిన ఎం. రాజశేఖర్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గడప దీప్తి, బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు వెంకట్ మహేంద్ర, బాశెట్టి శివకుమార్, గాండ్ల నరేంద్రనాథ్, రాచమల్ల అశోక్, పారా లీగల్ వాలంటీర్లు రమేష్, రాములు, ఉపాధ్యాయులు బి. నరేందర్, వి. అంజయ్య, షేక్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

