చదువుల వెనుక కార్పొరేట్ గ్రీడ్.
అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 29.
ప్రాణం పోసే ఆసుపత్రి బాధ్యత మరిచిపోయి కార్పొరేట్ బిజినెస్ సెంటర్ గా మారిపోతే… మెడిసిన్స్ అమ్మాల్సిన మెడికల్ షాపు కసాయి దుకాణంగా రూపాంతరం చెందితే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పడానికి తాజాగా సుప్రీంకోర్టులో జరిగిన ఈ లీగల్ వార్ఫేరే ప్రత్యక్ష సాక్ష్యం. రూ. 11 వేల క్యాన్సర్ ఇంజెక్షన్ కోసం ఏకంగా రూ. 1,30,000 వసూలు చేయడం, రూ. 15 సెలైన్ డ్రిప్ లైన్ కోసం రూ. 250 పిండడం వంటి సంఘటనలు మన దేశంలోని కార్పొరేట్ హాస్పిటల్స్ చేస్తున్న రియల్ రోడ్‌సైడ్ రాబరీకి అద్దం పడుతున్నాయి. బాధితుడు స్వయంగా ఆ మందులు పంపిణీ చేసే డీలర్ అయి ఉండి, “సార్, నేనే ఈ మందులు సప్లై చేస్తాను, నన్ను కాపాడండి, నా దగ్గరున్న ఇంజెక్షనే వాడండి” అని కాళ్లావేళ్లా పడినా కరగని కార్పొరేట్ రాయి లాంటి మనస్తత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా ఎండగట్టింది. “ఇది సర్దుబాటు కాదు… పగటిదోపిడీ! దారిదోపిడీ” అంటూ జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని, కార్పొరేట్ హాస్పిటల్ మాఫియాను కడిగేసింది.
ఒక సామాన్యుడు లేదా మధ్యతరగతి పౌరుడు అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్తే చికిత్స కంటే ముందు బిల్లు చూసి హార్ట్ ఎటాక్ రావడం నేడు గ్యారెంటీగా మారింది. దీని వెనుక మెడిసిన్ చదివిన చదువుల వెనుక దాక్కున్న ‘కార్పొరేట్ గ్రీడ్’ స్పష్టంగా కనిపిస్తోంది. ఆసుపత్రిలో చేరిన భార్య కీమోథెరపీ కోసం ఆమె భర్త (స్వయంగా డ్రగ్ డిస్ట్రిబ్యూటర్) రూ. 11,000 ఖరీదు చేసే ఇంజెక్షన్‌ను ఆసుపత్రికి తెచ్చి తన వద్ద ఉన్నదే వాడాలని వేడుకున్నాడు. కానీ కార్పొరేట్ రూల్స్ పేరుతో దాన్ని తిరస్కరించిన యాజమాన్యం, తమ ఇన్‌హౌస్ ఫార్మసీ నుంచే దాన్ని కొనుగోలు చేయాలని నిర్బంధించి ఏకంగా రూ. 1,30,000 వసూలు చేసింది. అంటే కేవలం ఒక్క ఇంజెక్షన్‌పై ఏకంగా 1100% ప్రాఫిట్ మార్జిన్‌ను గుంజుకున్నారు. ఇక సెలైన్ ఐవీ సెట్, సిరంజీలు, కాటన్, సర్జికల్ గ్లౌజెస్, కాథెటర్స్ వంటి కన్స్యూమబుల్స్ విషయానికి వస్తే.. ఇవన్నీ హోల్‌సేల్ మార్కెట్లో కేవలం రూ. 10 నుంచి రూ. 15లకే లభిస్తాయి. కానీ కార్పొరేట్ ఆసుపత్రులు బాధితుడి పేషెంట్ ఫైల్లో వీటికి రూ. 200 నుంచి రూ. 350 వరకు బిల్లు వేస్తూ దోచుకుంటున్నాయి. తయారీ సంస్థ ఒక మందు లేదా సర్జికల్ ఐటమ్‌ను తయారు చేయడానికి అయ్యే ఖర్చు కేవలం రూ. 8 అయితే, దానికి ప్రింట్ చేసే ఎంఆర్పీ మాత్రం రూ. 100 లేదా రూ. 200 ఉంటుంది. హాస్పిటల్స్ ఈ ఎంఆర్పీ పక్కన బ్రాండ్ పేరు చూపిస్తూ, పేషెంట్ల నుంచి వందల రెట్లు ఎక్కువ డబ్బు గుంజుతున్నాయి.
ఈ కేసు విచారణ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి “మేము ధరల విధానాన్ని నిరంతరం సర్దుబాటు చేస్తూనే ఉన్నాం” అని వాదించగా, ధర్మాసనం హై-వోల్టేజ్ ఆక్రోశాన్ని వ్యక్తపరిచింది. “మీ సర్దుబాటు పూర్తిగా దారి తప్పింది! రూ. 11 వేల నుంచి రూ. 1.30 లక్షలు కావడాన్ని సర్దుబాటు అనరు… దోపిడీ అంటారు! మనుషుల ప్రాణాలతో ఆడుకునేటప్పుడు ఇంత పెట్టుబడిదారీ ఆలోచన ఉండాలా? నిస్సహాయ స్థితిలో ఉన్న రోగులకు ఆసుపత్రుల దగ్గర బేరమాడే శక్త్యాయుధాలు ఉండవని మరచిపోవద్దు” అని మండిపడింది. ప్రభుత్వ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ కింద అత్యవసర మందుల జాబితా ఉన్నప్పటికీ, మార్కెట్లోని 90 శాతానికి పైగా నాన్-షెడ్యూల్డ్ మందులు, లైఫ్ సేవింగ్ క్యాన్సర్ డ్రగ్స్, మెడికల్ డివైజెస్ ఈ కంట్రోల్ పరిధికి పూర్తిగా బయటే ఉన్నాయి. ప్రభుత్వం ఇటీవల క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్‌ను 30 శాతానికి క్యాప్ చేసినట్లు చెబుతున్నా, అసలు నోటిఫై చేయని రూట్లలో ఎంఆర్పీలను ఇష్టారాజ్యంగా ప్రింట్ చేసుకునే సడలింపులను కంపెనీలు వాడుకుంటున్నాయి. మూడు పార్లమెంటరీ కమిటీలు నివేదికలిచ్చినా.. తెర వెనుక ఉన్న కార్పొరేట్ సూత్రధారులకు ఆ రిపోర్టులు నచ్చడం లేదు కాబట్టే ప్రభుత్వం మౌనంగా ఉండిపోతోందని ధర్మాసనం ఘాటుగా విమర్శించింది.
వివిధ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ థింక్-ట్యాంక్స్, సర్వేల ప్రకారం భారతదేశంలో హెల్త్‌కేర్ దారిదోపిడీ ఏ స్థాయిలో ఉందో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి..
ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి ఉంది కాబట్టే ప్రైవేట్ రంగం రాత్రింబవళ్లు సేవలు అందిస్తోందని, 24 గంటలూ సదుపాయాలు సిద్ధంగా ఉంచేందుకు కోట్ల రూపాయల నిర్వహణ ఖర్చు అవుతుందని చెప్పారు. మందుల మార్జిన్లు తగ్గించేస్తే ప్రైవేట్ ఆసుపత్రులు కుప్పకూలిపోతాయని, మార్కెట్లో సగం నకిలీ మందులు ఉన్నందున రోగులు బయటి నుంచి తెచ్చే మందులను తాము నమ్మలేమని వాదించారు. దీనిని సుప్రీంకోర్టు తీవ్రంగా తిప్పికొట్టింది. మీది కార్పొరేట్ హాస్పటల్… పడక రెంట్, డాక్టర్ ఫీజు, వెంటిలేటర్, ల్యాబ్ టెస్ట్‌లు… ప్రతిదానికీ వేర్వేరుగా ఛార్జీలు లాగుతున్నారు కదా… అలాంటప్పుడు మందులను 100%, 200%, 1000% రెట్లు ఎక్కువకు ఎందుకు అమ్మాలి? ప్రైవేట్ ఆసుపత్రి నడుపుతున్నామన్న కారణంతో ఈ ఎంఆర్పీని సమర్థించుకోలేరు. నిలదొక్కుకోవడానికి వేరే మార్గాలు చూసుకోండి కానీ, ప్రాణాలు కాపాడాల్సిన మందులపై ఈ దోపిడీ వద్దు… తయారీ సంస్థలు ఇచ్చే కార్పొరేట్ కట్-బాక్స్ డిస్కౌంట్ల గుట్టు ఇంకా బయటకు రాలేదు… అని తేల్చిచెప్పింది. ఆవిష్కరణల పేరుతో కంపెనీలు అధిక ధరలను సమర్థించుకోవడాన్ని తప్పుబడుతూ, గత 30 సంవత్సరాల్లో భారత ఫార్మా పరిశ్రమ సొంతంగా అభివృద్ధి చేసిన ఐదు కొత్త మాలిక్యూల్స్ పేర్లు చెప్పాలని ధర్మాసనం సవాల్ విసిరింది. అంటే విదేశీ పేటెంట్లను రీ-ప్యాకేజింగ్ చేసి, లాభాలు పిండుకోవడం తప్ప మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ శూన్యమని బట్టబయలు చేసింది.
. ప్రధానమంత్రి జన్ ఔషధి కేంద్రాలు ఉన్నప్పటికీ, పెద్ద పెద్ద కార్పొరేట్ డాక్టర్లు జనరిక్ మందులు రాయకుండా, బ్రాండెడ్ ఫార్మా కంపెనీల స్పాన్సర్డ్ ట్రిప్స్ కోసం బ్రాండెడ్ మందులనే రాస్తూ పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
న్యాయవాది కిషన్ చంద్ జైన్ దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నాన్-షెడ్యూల్డ్ మందులు, సర్జికల్ ఐటమ్స్, కన్స్యూమబుల్స్ ఉత్పత్తుల తయారీ ధరకు, రీటైల్ అమ్మకపు ధరకు మధ్య గరిష్టంగా 30% నుంచి 50% కంటే ఎక్కువ మార్జిన్ ఉండకుండా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధ నిబంధన తీసుకురావాలి. పేషెంట్లు క్వాలిటీ చెక్ కలిగిన సర్టిఫైడ్ బయటి ఫార్మసీల నుంచి మందులు తెచ్చుకునే వెసులుబాటును ప్రైవేట్ ఆసుపత్రులు నిరోధించకుండా కఠిన చట్టాలు చేయాలి. వైద్యులు తమ ప్రిస్క్రిప్షన్లలో కేవలం కెమికల్ మాలిక్యూల్ నామం మాత్రమే రాయాలి తప్ప, ఫార్మా కంపెనీల బ్రాండ్ పేర్లు రాయకూడదనే నిబంధనను కఠినంగా అమలు చేయాలి. వైద్యం అనేది లాభాలు పిండుకునే బిజినెస్ మోడల్ కాదు… అది రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు! ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రులే జేబులు గుల్ల చేసే కసాయి కొట్టులుగా మారితే, ఆ సమాజం వినాశనానికి దారితీస్తుంది. సుప్రీంకోర్టు ఇవ్వబోయే చారిత్రాత్మక తీర్పు భారతీయ హెల్త్‌కేర్ దోపిడీకి చెక్ పెడుతుందో లేదో వేచి చూడాలి!

