నవంబర్ 3న అమెరికాలో మధ్యంతర ఎన్నికలు,అధ్యక్షుడి పదవీకాలం సగం పూర్తయ్యాక ఈ ఎన్నికల నిర్వహణ.
వాషింగ్టన్: అర్జున్ సమాచారం డెస్క్ నవంబరు 3.
అ మెరికాలో నవంబర్ 3న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మా రిపబ్లికన్ పార్టీని గెలిపిస్తే.. 18 ఏళ్లు నిండిన అమెరికన్లందరికీ 5 వేల డాలర్ల చొప్పున ఇస్తానంటూ ఆకర్షణీయమైన హామీ కూడా ఇచ్చారు. అయితే మధ్యంతర ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం అంత తేలిక కాదని చరిత్ర చెబుతోంది. అమెరికాలో అసలు మధ్యంతర ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తారు…? ఈ ఎన్నికల్లో ఓడిపోతే అధ్యక్షుడిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? అనే వివరాలు చూద్దాం.
అమెరికాలో నాలుగేళ్లకు ఓసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయనే సంగతి తెలిసిందే. ఈ నాలుగేళ్ల పదవీకాలంలో సరిగ్గా సగం పూర్తవగానే జరిగే చట్టసభల ఎన్నికలనే మధ్యంతర ఎన్నికలు అని పిలుస్తారు. అధ్యక్షుడి పాలన పట్ల ప్రజలు ఇచ్చే రెఫరెండంలా దీన్ని భావించొచ్చు.
అమెరికా చట్టసభల్లో సీట్లు ఇలా..
మన దగ్గర లోక్ సభ, రాజ్యసభ ఉన్నట్లే.. అమెరికా పార్లమెంట్లోనూ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్ ఉంటాయి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ (ప్రతినిధుల సభ లేదా దిగువ సభ)లో 435 స్థానాలు ఉండగా.. సెనేట్లో మొత్తం 100 స్థానాలు ఉంటాయి. దిగువ సభ సభ్యులు పదవీ కాలం రెండేళ్లు. కాబట్టి మధ్యంతర ఎన్నికల్లో మొత్తం 435 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మన రాజ్యసభ సభ్యుల్లాగే సెనేటర్ల పదవీ కాలం ఆరేళ్లు ఉంటుంది. సెనేట్లో మూడో వంతు స్థానాలకు ప్రతి రెండేళ్లకు ఓసారి ఎన్నికలు జరుగుతాయి. దిగువ సభలో జనాభా ఆధారంగా రాష్ట్రాలకు సీట్లను కేటాయిస్తే.. సెనేట్లో ప్రతి రాష్ట్రానికి రెండు చొప్పున సీట్లు ఉంటాయి..
దిగువ సభ పదవీ కాలం రెండేళ్లే.ఈసారి మధ్యంతర ఎన్నికల సమయంలో దిగువ సభలోని 435 స్థానాలతోపాటు ఎగువ సభలోని 35 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అమెరికా ఎన్నికల నిబంధనల ప్రకారం జాతీయ స్థాయి ఎన్నికలను నవంబర్ నెల మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం రోజున నిర్వహిస్తారు. ఈసారి నవంబర్ నెలలో మొదటి సోమవారం రెండో తేదీన వస్తుంది. మంగళవారం నవంబర్ 3న వస్తోంది.

