హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష….
అర్జున్ సమాచారం జులై 8 జగిత్యాల ప్రతినిధి ::
రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో నమోదైన హత్య కేసులో నిందితుడికి నేడు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జగిత్యాల 1వ అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి శ్రీమతి జి. సునీత రవీంద్ర రెడ్డి తీర్పు వెలువరించారు.
కేసు వివరాల ప్రకారం, రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్కూపూర్ గ్రామానికి చెందిన పిట్టల గోపాల్‌కు, బాధిత కుటుంబానికి డ్రైనేజీ కాలువలో వర్షపు నీటితో వచ్చిన చెత్త విషయంలో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో 29-08-2022 తేదీన బాధితుడు అంకయ్య తో మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన నిందితుడు పిట్టల గోపాల్, సమీపంలో ఉన్న కర్రను తీసుకొని అంకయ్య ను వెంబడించి తలపై బలంగా దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు వెంటనే కుటుంబ సభ్యులు బాధితుడిని మొదటగా రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ 30-08-2022 తేదీన అంకయ్య మృతి చెందారు.
ఈ ఘటనపై అంకయ్య కూతురు ఫిర్యాదు మేరకు రాయికల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో నిందితుడిపై పటిష్టమైన సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానంలో సమర్పించడం తో ఈరోజు జగిత్యాల 1వ అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు నిందితుడు పిట్టల గోపాల్ 44 సంవత్సరాలుకు యావజ్జీవ కారాగార శిక్ష తో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
