గోదావరిఖని,అర్జున్ సమాచారం:
ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన నిరసన కార్యక్రమంలో నిరుద్యోగ యువతపై దాడి చేయడాన్ని నిరసిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం ఎదుట చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ బుధవారం గోదావరిఖని మున్సిపల్ కార్యాలయం ఎదుట రాజీవ్ రహదారిపై ఎన్.ఎస్.యు.ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ… లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కల్పించిందని, ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానపరచడమేనని అన్నారు.
ప్రతిపక్షం ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం, విమర్శిస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం బీజేపీ ప్రభుత్వంలో నిత్యకృత్యంగా మారిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను గౌరవించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.
దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేషన్ అధ్యక్షుడు, పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన ప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
===================

