అర్జున్ సమాచారం:
తెలంగాణ స్టేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (నివారణ) బిల్లు–2026పై ఏర్పాటైన సెలెక్ట్ కమిటీ సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలతో పాటు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బిల్లులోని ప్రధాన నిబంధనలు, అమలు విధానం, వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలపై కమిటీ సభ్యులు చర్చించారు. ఈ బిల్లును ఈ ఏడాది మార్చిలో తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ద్వేషపూరిత ప్రసంగాలు, కులం, మతం, జాతి, భాష, ప్రాంతం లేదా ఇతర గుర్తింపుల ఆధారంగా వ్యక్తులు, వర్గాలపై విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలను అరికట్టడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. మతం, కులం, జాతి, భాష లేదా ఇతర గుర్తింపుల ఆధారంగా విద్వేషాన్ని ప్రేరేపించే ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు, ప్రచార సామగ్రి, బహిరంగ సభల్లో చేసే ద్వేషపూరిత వ్యాఖ్యలను ఈ చట్టం కింద నేరంగా పరిగణించనున్నట్లు బిల్లులో ప్రతిపాదించారు.
బిల్లులోని ప్రతిపాదనల ప్రకారం, మొదటిసారి నేరానికి కనీసం ఒక సంవత్సరం నుంచి గరిష్ఠంగా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ.50 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అదే నేరాన్ని పునరావృతం చేస్తే రెండు నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు అధిక మొత్తంలో జరిమానా విధించాలని ప్రతిపాదించారు.
అంతేకాకుండా, ద్వేషపూరిత నేరాల వల్ల నష్టపోయిన బాధితులకు తగిన నష్టపరిహారం అందించే విధానాన్ని కూడా బిల్లులో పొందుపరిచారు. బిల్లును మరింత సమగ్రంగా రూపొందించేందుకు వచ్చిన సూచనలు, అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం సెలెక్ట్ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది
==============================

