కరీంనగర్,అర్జున్ సమాచారం:
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని గల్లీగల్లీని అభివ్రుద్ధి చేస్తానని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు తన పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తానని స్పష్టం చేశారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం పలు అభివ్రుద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పరామర్శలతో బిజీబిజీగా గడిపారు. ఉదయం 9 గంటలకు తన నివాసం వద్దకు వచ్చిన సందర్శకులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్న బండి సంజయ్ ఆ తరువాత 10.30 గంటలకు స్థానిక కార్పొరేటర్లు, బీజేపీ నాయకులతో కలిసి పలు అభివ్రుద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
తొలుత 48వ డివిజన్ లోని విద్యానగర్ కురుమవాడలో కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తోపాటు స్థానిక కార్పొరేటర్ కర్ర పద్మ అనిల్ తో కలిసి కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ నిధుల్లో రూ.80 లక్షలు యూఐడీఎఫ్ నిధులు కాగా, మిగిలిన రూ.20 లక్షలు మున్సిపల్ సాధారణ ఫండ్ కు సంబంధించినవి.
అనంతరం 19వ డివిజన్ లోని రేకుర్తి ముదిరాజ్ కాలనీకి వెళ్లిన కేంద్ర మంత్రి రూ.40 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. అట్లాగే లక్ష్మీ నరసింహ కాలనీలో రూ.57 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడి నుండి మొగ్దుంపూర్ వెళ్లిన కేంద్ర మంత్రి రూ.10 లక్షల జాతీయ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన మహిళాశక్తి ధరణి గ్రామైఖ్య సంఘ భవనాన్ని స్థానిక సర్పంచ్ శివకుమార్ తో కలిసి ప్రారంభించారు.
అట్లాగే రూ.15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రెయిన్ ను ప్రారంభించారు.
అంతకుముందు చింతకుంట వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అంబేద్కర్ భవన్ సమీపంలో నిర్వహించిన ‘వన మహోత్సవం-2026 లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కు అధికారులతోపాటు మహిళలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి స్వయంగా మొక్కలను నాటారు. మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్, అధికారులు సైతం మొక్కలు నాటారు. అనంతరం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
కరీంనగర్ కార్పొరేషన్ లోని ప్రతి గల్లీగల్లీని అభివ్రుద్ధి చేయాలని నిర్ణయించాం. ముఖ్యంగా అభివ్రుద్ధికి అంతగా నోచుకోని నగర శివారు గ్రామాల్లోని గల్లీగల్లీలో సీసీ రోడ్లను నిర్మిస్తాం. అందుకోసం కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తాం. ఇప్పటికే స్మార్ట్ సిటీ కింద 900 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దినం. ఇవిగాకుండా అమ్రుత్ 1, 2 కింద 279 కోట్ల రూపాయలు ఖర్చు చేసినం. అట్లాగే అర్బన్ డెవలెప్ మెంట్ ఫండ్ కింద రూ.50 కోట్లు వచ్చినయ్. వాటితో గల్లీల్లో రోడ్లు, ఇతర అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టినం. తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణం కోసం కేంద్రమే పూర్తిగా 156 కోట్లను మంజూరు చేసింది. శరవేగంగా పనులు జరుగుతున్నాయి.
తాజాగా 840 కోట్ల యూసీఎఫ్ నిధులతో కరీంనగర్ కార్పొరేషన్ రూపురేఖలే మారబోతున్నాయి. కరీంనగర్ లో మోడల్ రోడ్లను నిర్మిస్తాం. స్కై వాక్ లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి లను నిర్మిస్తాం, నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్ పోర్ట్ మోటార్, ఇంధనం ఉపయోగించే రవాణా వాహనాలు వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తాం. కరీంనగర్ శివారు ప్రాంతాల్లోని గల్లీగల్లీలో సీసీ రోడ్లను నిర్మిస్తాం. అభివ్రుద్ధిలో తెలంగాణలోనే కరీంనగర్ ను ఆదర్శంగా తీర్చిదిద్దడంతోపాటు సుందర నగరంగా మార్చబోతున్నాం. కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు తనకు ఓట్లేసి గెలిపించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకు శాయశక్తులా క్రుషి చేస్తున్నా. అందుకోసం నా పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధిలో భాగంగా ఇప్పటికే రూ.22 వేల కోట్లు నిధులు ఖర్చు పెట్టిన. పలు అభివ్రుద్ది పనులు చేసిన. త్వరలోనే వివిధ కేంద్ర పథకాల కింద మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నా.
==============================

