ePaper
Thursday, August 13, 2026
ePaper
Homeతెలంగాణసింగరేణి కార్మికుల భద్రతపై నిర్లక్ష్యం తగదు..కనీస రక్షణ పరికరాలు వెంటనే సమకూర్చాలి: కేంగర్ల మల్లయ్య.

సింగరేణి కార్మికుల భద్రతపై నిర్లక్ష్యం తగదు..కనీస రక్షణ పరికరాలు వెంటనే సమకూర్చాలి: కేంగర్ల మల్లయ్య.

📰 Generate e-Paper Clip

సింగరేణి కార్మికుల భద్రతపై నిర్లక్ష్యం తగదు.
.కనీస రక్షణ పరికరాలు వెంటనే సమకూర్చాలి: కేంగర్ల మల్లయ్య.

అర్జున్ సమాచారం జులై 12 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి:

మంచిర్యాల: సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస రక్షణ పరికరాలు అందుబాటులో ఉంచాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య వ్యవస్థాపక కన్వీనర్ కేంగర్ల మల్లయ్య డిమాండ్ చేశారు. రక్షణ పరికరాల కొరత కారణంగా కార్మికులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్జీ–2 పరిధిలో నాయకులు శశికాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బాయిబాట కార్యక్రమంలో కేంగర్ల మల్లయ్య మాట్లాడారు. గనుల్లో పనిచేసే కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. కార్మికుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించడం సరికాదని స్పష్టం చేశారు.
గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడాల్సింది పోయి వ్యక్తిగత పైరవీలకు అలవాటు పడటంతో సమస్యలు పేరుకుపోతున్నాయని మల్లయ్య విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన జాతీయ కార్మిక సంఘాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే గని అధికారుల కార్యాలయాల ఎదుట కంటితుడుపు ధర్నాలు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు.
కార్మికుల హక్కుల సాధన కోసం ప్రతి కార్మికుడు మేల్కొనాలని, తమ సమస్యలపై ప్రశ్నించే ధైర్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్యకు కార్మికులు అండగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దొడ్ల సతీష్, నాగుల మోహన్రావు, తండ్ర సత్యనారాయణ, విజయ భాస్కర్, పైండ్ల మహేందర్, జక్కుల శంకర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!