అసంపుర్తి చరిత్రతో ఎ జర్నీ ఆఫ్ లవ్.
విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 21.
ఒక వ్యక్తి ఆత్మకథ కేవలం వారి వ్యక్తిగత జ్ఞాపకాల సేకరణ కాదు. అది వారి అంతరాత్మకు అద్దం పట్టే పత్రం. కానీ, కొందరి జ్ఞాపకాలు సానుభూతి కోరుకునే నాటకాలుగా మారినప్పుడు, చరిత్ర వాటిని ప్రశ్నించక తప్పదు.”భారత రాజకీయాల్లో అగ్రనాయకుల ఆత్మకథలు కేవలం వారి గతాన్ని నెమరువేసుకోవడానికి మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో కోల్పోయిన ప్రజాదరణను తిరిగి సంపాదించుకునే భావోద్వేగ అస్త్రాలుగా మారుతుంటాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తాజాగా విడుదల చేసిన తన ఆత్మకథ బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ అక్షరాలా ఇదే కోవకు చెందుతుంది. తన జీవితంలోని వ్యక్తిగత కష్టాలు, విషాదాలు, భావోద్వేగాలను ముందుపెట్టి దేశం మొత్తానికి తనను తాను ఒక నిస్సహాయ బాధితురాలిగా, త్యాగమూర్తిగా చిత్రీకరించుకునే ప్రయత్నం ఈ పుస్తకంలో అడుగడుగునా కనిపిస్తుంది. తన జీవిత ప్రయాణాన్ని భారతీయతకు ఆపాదించడం ద్వారా, సామాన్య ప్రజల కష్టాలతో తన రాజవంశపు అనుభవాలను ముడిపెట్టే ఒక కృత్రిమ ప్రయత్నం చేశారు. అయితే, క్షేత్రస్థాయి వాస్తవాల కోణంలో ఆలోచిస్తే— పూట గడవక కష్టపడే శ్రమజీవులు, నిత్యం కన్నీళ్లతో పోరాడే కోట్లాది సామాన్య కుటుంబాల జీవితాలకు, ఢిల్లీ అధికార కోటల్లో సర్వసౌకర్యాల మధ్య సాగిన గాంధీ కుటుంబపు ప్రయాణానికి అసలు పొంతన ఎక్కడుంది? ప్రతి కుటుంబం ఎదుర్కొనే సాధారణ కష్టాలను, త్యాగాలను తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ,అలాంటి కష్టాలు తాను పడినట్లుగాచెప్పుకుని మరోసారి సింపతీ కార్డ్ ప్రయోగించడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న ఇక్కడ బలంగా ఉదయిస్తోంది. దశాబ్దాల పాటు దేశాన్ని, పార్టీని తమ గుప్పిట్లో పెట్టుకుని శాసించిన నాయకత్వం, నేడు రాజకీయంగా ఉనికి కోల్పోతున్న తరుణంలో ప్రజల సానుభూతిని ఓట్లుగా మలుచుకునేందుకే ఈ భావోద్వేగ నాటకానికి తెరలేపిందని చెప్పక తప్పదు. అంతకుమించి, ఈ 544 పేజీల పుస్తకం ద్వారా సోనియా గాంధీ కేవలం తన వ్యక్తిగత జ్ఞాపకాలను పంచుకోవడమే కాకుండా,కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మాయని మచ్చలుగా మిగిలిపోయిన నిరంకుశ విధానాలను, అప్రజాస్వామిక కుటుంబ పాలనను,ప్రజాబలం లేని హైకమాండ్ సంస్కృతి ని సమర్థించుకునే ఒక విఫలయత్నం చేశారు. నాటి ఎమర్జెన్సీ వంటి చీకటి అధ్యాయాలను సైతం తప్పిదం అంటూనే ఇందిరా గాంధీని ప్రజాస్వామ్యవాదిగా వెనకేసుకురావడం, దశాబ్ద కాలం పాటు రాజ్యాంగేతర శక్తిగా తాను నడిపిన పాలనను గొప్ప సమన్వయంగా చిత్రీకరించుకోవడం ఇందుకు నిదర్శనం. చరిత్ర చేసిన తప్పులకు ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది పోయి, భావోద్వేగాల ముసుగులో ఆ నిరంకుశ పోకడలకు పవిత్రత ఆపాదించాలని చూడటం నేటి చైతన్యవంతమైన భారతీయ సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు!సోనియా గాంధీ తన ఆత్మకథలో మాజీ రాష్ట్రపతి, అత్యంత మేధావి, కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా సేవ చేసిన అనుభవజ్ఞుడు ప్రణబ్ ముఖర్జీ ప్రధాని పదవిని ఆశించినట్లుగా అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారానికి దారితీసింది. ఇది కేవలం చరిత్రను వక్రీకరించడమే కాకుండా, పార్టీలో ప్రతిభను అణచివేసే గాంధీ కుటుంబ నైజాన్ని మరోసారి బయటపెట్టింది. నిజానికి, ప్రణబ్ ముఖర్జీ లాంటి ఉద్దండుడైన నాయకుడిని ప్రధాని పదవికి ఎంపిక చేస్తే, ఆయన పార్టీలో ఏకు మేకు అవుతారని.. తన ఆధిపత్యానికి, హైకమాండ్ కనుసన్నల్లో జరిగే రాజకీయాలకు గండి కొడతారనే భయంతోనే సోనియా ఆ పదవిని దక్కకుండా చేశారనేది అందరికీ తెలిసిన వాస్తవం. పార్టీపై కుటుంబ పట్టు సడలిపోతుందనే ఏకైక కారణంగానే దేశానికి సేవ చేసే అత్యున్నత అవకాశాన్ని ప్రణబ్ దాకా రానివ్వకుండా అడ్డుకున్నారు. నేడు అదే విషయాన్ని తన పుస్తకంలో తిరగేసి, ప్రణబ్ ముఖర్జీనే పదవి కోసం ఆరాటపడ్డారని రుద్దేయడం సోనియా రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. ఒక సీనియర్ నాయకుడిని రాజకీయ స్వార్థం కోసం ఎలా బలి చేశారనే దానికి ఈ ఆత్మకథే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది.దేశాన్ని దివాళా స్థితి నుంచి గట్టెక్కించి ఆధునిక భారతానికి ఆర్థిక పునాదులు వేసిన మహానాయకుడి పేరును తమ చరిత్ర పుటల నుంచి తుడిచేయగలరేమో కానీ.. కోట్లాది భారతీయుల హృదయాల నుంచి మాత్రం చెరపలేరు!. భారతదేశం అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితిలో ఉన్న వేళ..సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించిన దార్శనికుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. కేవలం దేశ ఆర్థిక వ్యవస్థనే కాకుండా, రాజీవ్ గాంధీ మరణానంతరం సంక్షోభంలో పడ్డ కాంగ్రెస్ పార్టీని సైతం సుదీర్ఘకాలం అధికారంలో నిలబెట్టడంలో పీవీ పాత్ర అనన్యసామాన్యం. కానీ, సోనియా గాంధీ ఆత్మకథలో పీవీ నరసింహారావు ప్రస్తావన కనీవినీ రీతిలో విస్మరించబడటం యాదృచ్ఛికం కాదు. గాంధీ కుటుంబ కనుసన్నల్లో కాకుండా, తన సొంత మేధస్సుతో, స్వయంకృషితో దేశాన్ని నడిపిన పీవీ అంటే సోనియా గాంధీకి మొదటి నుంచీ తీవ్రమైన విభేదాలు ఉండేవి. తమ కుటుంబం వెలుపల ఏ నేత కూడా పార్టీకి, దేశానికి గొప్ప నాయకత్వం వహించకూడదనే సంకుచిత మనస్తత్వమే నాటి విభేదాలకు అసలు కారణం. ఆ కక్ష , అసూయ ఎంత తీవ్రంగా ఉండేదంటే పీవీ జీవించి ఉన్నప్పుడే కాకుండా, ఆయన మరణించిన తర్వాత కూడా కాంగ్రెస్ హైకమాండ్ అత్యంత అవమానకరంగా వ్యవహరించింది. 2004లో పీవీ కన్నుమూసినప్పుడు, దేశానికి ఐదేళ్ల పాటు ప్రధానిగా సేవలందించిన ఒక మహానాయకుడి పార్థివ దేహాన్ని కనీసం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం లోపలికి కూడా రానివ్వకుండా గేటు బయటే ఉంచి అవమానించిన చీకటి చరిత్ర సోనియా నాయకత్వానిది. ఢిల్లీలో ఆయన అంత్యక్రియలకు కనీసం స్థలం కేటాయించేందుకు కూడా మనసు రాని కఠిన వైఖరిని నాడు ప్రపంచం మొత్తం చూసింది. గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందని ఒక దక్షిణాది మేధావి దేశానికి ఆర్థిక విముక్తి కల్పించాడనే అక్కసుతో, ఆయన పేరును, కీర్తిని తొక్కేయడానికి నాడు అధికార పీఠంపై ఉండి అన్ని రకాల అవమానాలకు గురిచేశారు. ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత కూడా ఆ ద్వేషం ఏమాత్రం తగ్గలేదని సోనియా తన ఆత్మకథ ద్వారా మరోసారి నిరూపించుకున్నారు. సొంత పార్టీ సీనియర్లు, పీవీ కుటుంబ సభ్యులు సైతం తప్పుబట్టే విధంగా, దేశ చరిత్రను మలుపుతిప్పిన పీవీ ప్రస్థానాన్ని తన పుస్తకంలో ఉద్దేశపూర్వకంగానే చెరిపివేయడం చరిత్రకు చేసిన ఘోర ద్రోహం. అప్పుడు పార్థివ దేహాన్ని పార్టీ ఆఫీసులోకి రానివ్వకుండా అవమానిస్తే, ఇప్పుడు అక్షరాల రూపంలోనూ ఆయన ఉనికి లేకుండా చేసి రెండోసారి అవమానించారు. తమ కుటుంబానికి భజన చేసేవారిని మాత్రమే ఆకాశానికెత్తుతూ, దేశం కోసం పనిచేసిన పీవీ లాంటి అసలైన దేశభక్తులను విస్మరించడం ద్వారా— కాంగ్రెస్ అంటే కేవలం ఒకే కుటుంబం, మిగతావారంతా అక్కడ కేవలం పనివారు మాత్రమేననే కఠిన సత్యాన్ని సోనియా గాంధీ తన కలంతోనే లోకానికి చాటిచెప్పారు ఒకప్పుడు భావోద్వేగ ప్రసంగాలతో, కన్నీటి గాథలతో ప్రజలను ఆకర్షించిన రోజులు ఎప్పుడో గతించిపోయాయి. నేటి సమాజం ఈ మొసలి కన్నీళ్లను నమ్మే స్థితిలో ఏమాత్రం లేదు. దేశ ప్రజానీకం ఎప్పుడూ మోసపోరని, ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచిన చీకటి రోజులను, ఎమర్జెన్సీ నాటి అరాచకాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదు.అంతిమంగా ఒక్క విషయం స్పష్టం గాంధీ కుటుంబానికి ఈ దేశం ఏమాత్రం రుణపడి లేదు. ఈ దేశ సంపద కానీ,రాజ్యాధికారం కానీ ఏ ఒక్క కుటుంబానికో దఖలు పడిన వారసత్వ హక్కు అంతకన్నా కాదు. సార్వభౌమాధికారం కలిగిన ప్రజాస్వామ్యంలో ఎల్లప్పుడూ ప్రజలే సర్వోన్నతులు. పడిపోయిన తమ కుటుంబ కీర్తిని తిరిగి పునరుద్ధరించుకోవడానికి,వాస్తవాలను మరుగున పరిచి రాసుకున్న ఈ కట్టుకథల పుస్తకం బిలాంగింగ్ రేపటి చరిత్ర ముందు ఒక దోషిగా నిలబడక తప్పదు!

