ePaper
Friday, November 6, 2026
ePaper
Homeఎడిటోరియల్ఐడీబీఐ వాటాలపై అనుమానాలు.

ఐడీబీఐ వాటాలపై అనుమానాలు.

📰 Generate e-Paper Clip

ఐడీబీఐ వాటాలపై అనుమానాలు.

విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 5.

బిజెపి ప్రభుత్వం మరో ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. 1964లో పారిశ్రామిక అభివృద్ధి రుణాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పరచిన ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడిబిఐ ని కెనడాకు చెందిన ఫెయిర్ ఫ్యాక్స్ హోల్డింగ్స్‌కి కేంద్రం అప్పగిస్తోంది. అక్టోబర్ 14న కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దీనికి ఆమోద ముద్రవేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఈ బ్యాంకుపై అధికారం చేతులు మారిపోతుంది. బ్యాంకుల విస్తరణ కారణంగా ఐడిబిఐ 2015లో పబ్లిక్ సెక్టర్ బ్యాంకుగా మారిపోయింది. ప్రస్తుతం అది మిగతా వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే శాఖల ఏర్పాటుతోపాటు సేవలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 2100 శాఖలు ఉన్న ఈ బ్యాంకులో 20వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.  2015-16 లో ఈ బ్యాంకును మూల ధన కొరత, నిరర్థక ఆస్తుల పెరుగుదల లాంటి చిక్కులను ఎదుర్కొని రూ. 3వేల కోట్ల నష్టాలను మూట కట్టుకుంది. ఈ విపత్తు నుండి బ్యాంకును బయటపడేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసినీ వాడుకుంది. రూ. 22వేల కోట్లు వెచ్చించి ఎల్‌ఐసి ఈ బ్యాంకులో సుమారు సగం వాటాను సొంతం చేసుకుంది. అలా బలపడిన ఐడిబిఐ ఇప్పటికీ లాభాల బాటలోనే నడుస్తోంది. ఆనాటి వాటా అమ్మకంవల్ల ఈ బ్యాంకుపై హక్కులు 45.48% కేంద్ర ప్రభుత్వానికి, 49.24% ఎల్‌ఐసికి చెందుతాయి. ఇందులోంచి ఇప్పుడు కేంద్రం 30.48%, ఎల్‌ఐసి 30.24% వాటాను ఫెయిర్ ఫ్యాక్స్ హోల్డింగ్‌కి అమ్మేస్తున్నాయి. వాటి మొత్తం విలువ రూ. 53 వేల కోట్లు. జులైలో జరిగిన వేలం పాటలో ఆ ఒక్క సంస్థే పాల్గొనడంతో ఈ ఒప్పందం కుదిరింది. ఇందువల్ల రూ. 81 ఉన్న బ్యాంకు షేర్ విలువను రూ. 76కు తగ్గించవలసి వచ్చింది. ఎల్‌ఐసికి మిగలబోయే 19% వాటాను కూడా త్వరలోనే బహిరంగ మార్కెట్ ద్వారా అమ్మేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది.  ఐడిబిఐలో ఈ వాటాను కొనుగోలు చేసి బ్యాంకుపై పెత్తనం పొందుతున్న ఫెయిర్ ఫ్యాక్స్ హోల్డింగ్ సంస్థ యజమాని వివియన్ ప్రేమ్ వత్స. అతను ప్రవాస భారతీయుడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఐఐటి మద్రాస్‌లో చదివాడు. కెనడా వెళ్లి ఒక దివాళా తీసిన బీమా కంపెనీని కొని ఫెయిర్ ఫ్యాక్స్ హోల్డింగ్‌గా పేరు మార్చి లాభాలు గడిస్తూ ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగారు. తన వ్యాపార విస్తరణలో భాగంగా ఇప్పుడు ఐడిబిఐని కొనుగోలు చేస్తున్నారు. బలమైన పునాదులున్నప్పటికీ సంక్షోభంలో ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడమే ప్రేమ్ వత్సా విజయానికి ప్రధాన సూత్రం.అలాంటి కంపెనీలను గుర్తించడంలో ఆయనకు అసాధారణమైన సామర్థ్యం ఉంది. అంతేకాదు, వాటిలో దీర్ఘకాలం పెట్టుబడులను కొనసాగించే సహనం కూడా ఉంది.కాలగమనాన్ని అంచనా వేయడంలోనూ వత్సా దిట్ట. సంక్షోభం రాబోతోందన్న సంకేతాలను ముందుగానే పసిగట్టగలరు.ఈ సామర్థ్యంతోనే 1987లో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పతనాన్ని, బ్లాక్ మండేగా ప్రసిద్ధి చెందిన పరిణామాన్ని, 1990లో జపాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడాన్ని, 2008లో సబ్‌ప్రైమ్ సంక్షోభంగా పిలిచే అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని ఆయన ముందుగానే గుర్తించారు.ఆ సమయంలో అమెరికా ఆర్థిక మందగమనాన్ని అవకాశంగా మలుచుకున్న ప్రేమ్ వత్సా, భవిష్యత్తులో మంచి పనితీరు కనబరిచే అవకాశమున్న కంపెనీల షేర్లను అతి తక్కువ ధరలకు కొనుగోలు చేశారు.అయితే, ఫెయిర్‌ఫాక్స్ కూడా ఎదురుదెబ్బలు చవిచూసింది. హార్వీ, ఇర్మా, మారియా తుపానులతో పాటు కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చుల వల్ల సంస్థకు గణనీయమైన నష్టాలు వచ్చాయి.కోవిడ్-19 మహమ్మారి కూడా సంస్థకు పెద్ద సవాలుగా మారింది. ఆ సమయంలో దాని బీమా వ్యాపారం భారీ నష్టాలను చవిచూసింది.అయితే, ప్రేమ్ వత్సా సామర్థ్యం ఫెయిర్‌ఫాక్స్‌ను మళ్లీ పుంజుకునేలా చేసింది.2022 అక్టోబర్‌తో పోలిస్తే 2025లో ఫెయిర్‌ఫాక్స్ విలువ నాలుగు రెట్లు పెరిగింది.ఫెయిర్‌ఫాక్స్ వ్యాపార వ్యూహం విజయవంతమైంది.బీమా క్లెయిమ్‌లు చెల్లించాల్సిన సమయం రాకముందే భారీ మొత్తంలో ప్రీమియంలను వసూలు చేసి, బలమైన పునాదులున్నప్పటికీ తక్కువ ధరకు లభించే షేర్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా సంస్థ విజయాన్ని సాధించింది.వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా ప్రేమ్ వత్సాకు పద్మశ్రీ పురస్కారం లభించింది.ఇప్పటికే ఆయన 2016 లో రూ. 1180 కోట్లతో కేరళంలోని సిఎస్‌బి బ్యాంకులో 51% వాటా సొంతం చేసుకున్నారు. 2020 లో భారత కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించడం విశేషం. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఒక విదేశీయుడు దేశంలోని రెండు బ్యాంకులను హస్తగతం చేసుకోరాదు. ఈ లెక్కన ఫెయిర్ ఫ్యాక్స్ సంస్థ ఒక బ్యాంకు నుంచి వైదొలగాలి లేదా రెండు బ్యాంకులను కలిపేసి ఒక్క బ్యాంకుగా మార్చాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటాలను బహిరంగంగా అమ్మేస్తూ, వాటిలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచుతూ దేశ బ్యాంకింగ్ రంగాన్ని బలహీనపరుస్తోంది. బ్యాంకులను జాతీయం చేసిన లక్ష్యాలకు అవి దూరమవుతున్నాయి. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలు, ఆందోళనలు చేపట్టినా వాటి ప్రభావం ప్రభుత్వ చర్యలపై పెద్దగా ఉండడం లేదు. ఐడిబిఐని బాహాటంగా అమ్మేయడమే దీనికి తార్కాణం. దేశంలోని రెండు బ్యాంకులను ఒకే విదేశీ సంస్థ కొనుగోలు చేయడం వల్ల ఆ రెండు బ్యాంకుల ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఒక బ్యాంకులోంచి వాటా వెనక్కి తీసుకొనే బదులు రెండింటిని కలిపి వేయడానికే యాజమాన్యం మొగ్గు చూపుతుంది. ప్రైవేటు చేతుల్లోకి వెళ్లి తమ అస్తిత్వాన్ని కోల్పోవడానికి ఐడిబిఐ ఉద్యోగులు సిద్ధంగా లేరు. ఇప్పటికే ఫెయిర్ ఫాక్స్ సొంతమైన సిఎస్‌బి ప్రైవేటు బ్యాంకు, ఐడిబిఐ ప్రభుత్వ రంగ బ్యాంకు. ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటు చేతుల్లోని వెళితే దాని ప్రభావం ఉద్యోగుల పని భారం, వేతనాలపై అధికంగా పడుతుంది. ఇక నుంచి ఐడిబిఐ ఉద్యోగుల వేతన సవరణ మిగతా జాతీయ బ్యాంకుల ఉద్యోగుల మాదిరిగా ఉండదు. జరగబోయే ఉద్యోగ నియామకాల్లో, ప్రమోషన్లలో రాజ్యాంగబద్ధ్ద రిజర్వేషన్లు ఉండవు. ఉద్యోగ భద్రత విషయంలో ఐడిబిఐ సిబ్బంది ఎంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ వారు ఇప్పటికే ఉద్యమం బాటపట్టారు. ఈ నెల 2, 3 తేదీల్లో బ్యాంకులు మూసేసి సమ్మెలో పాల్గొన్నారు. దీపావళి తర్వాత పూర్తి స్థాయి కార్యాచరణ ఉంటుందని వారి నేతలు అంటున్నారు. ప్రభుత్వం తగిన హామీలు ఇవ్వకుంటే తమ ప్రతిఘటనను తీవ్రతరం చేస్తామని, దేశంలోని అన్ని బ్యాంకు ఉద్యోగ సంఘాలను సంప్రదించి, వారి ఐక్యతతో దేశవ్యాప్త నిరసనలు చేపడతామని అంటున్నారు. సాంకేతికత పైచేయి వల్ల ఉద్యోగ శక్తి బలహీనపడి ప్రభుత్వాలకు ఎదురు లేకుండాపోయింది. బ్యాంకుల కంప్యూటరీకరణ ఉద్యోగుల ప్రమేయాన్ని తగ్గించింది. ఏ ప్రభుత్వ రంగ సంస్థనైనా కేంద్రంలో ఉన్న బిజెపి కూటమి తన ఇష్టారాజ్యంగా అంగట్లో పెడుతోంది. ఇది కేవలం ఐడిబిఐ సమస్యే అనుకోరాదు. పాలన ఇలాగే ఉంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఎదురుకావచ్చు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!