ePaper
Tuesday, October 6, 2026
ePaper
Homeఎడిటోరియల్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే  సక్సెస్,1,090 కోట్ల స్టీల్‌ బ్రిడ్జీలు, అండర్‌పాస్‌ల  రద్దు

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే  సక్సెస్,1,090 కోట్ల స్టీల్‌ బ్రిడ్జీలు, అండర్‌పాస్‌ల  రద్దు

📰 Generate e-Paper Clip

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే  సక్సెస్,1,090 కోట్ల స్టీల్‌ బ్రిడ్జీలు, అండర్‌పాస్‌ల  రద్దు

హైదరాబాద్, అక్టోబరు 5, (అర్జున్ సమాచారం ప్రతినిధి.

హైదరాబాద్‌ కేబీఆర్‌ పార్కు చుట్టూ ఏడు కూడళ్లలో చేపట్టాలని భావించిన రూ.1,090 కోట్ల స్టీల్‌ బ్రిడ్జీలు, అండర్‌పాస్‌ల ప్రాజెక్టును జీహెచ్‌ఎంసీ రద్దు చేసింది. వన్‌వే విధానం అమలు చేసిన తర్వాత ట్రాఫిక్‌ సమస్య గణనీయంగా తగ్గడంతో భారీ వ్యయంతో నిర్మాణాలు చేపట్టడం అవసరం లేదని ప్రభుత్వం భావించింది. జూబ్లీ చెక్‌పోస్టు, కేబీఆర్‌ పార్కు గేట్, ముగ్ధా జంక్షన్‌, బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి తదితర ప్రాంతాల్లో పనులను నిలిపివేశారు. కాంట్రాక్టర్లు కేఎన్‌ఆర్‌, మేఘాతో చేసుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేశారు. ఇదే సమయంలో పంజాగుట్ట నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు కొత్త ఎలివేటెడ్‌ కారిడార్‌కు మార్గం సుగమమైంది.హైదరాబాద్‌ నగరానికి కీలకమైన కేబీఆర్‌ పార్కు చుట్టూ ఏడు ప్రధాన కూడళ్లలో చేపట్టాలని ప్రతిపాదించిన స్టీల్‌ బ్రిడ్జీలు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి బ్రేక్‌ పడింది. మొత్తం రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో రెండు ప్యాకేజీలుగా చేపట్టిన ఈ పనులను రద్దు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. నిర్మాణ పనులు ప్రారంభిస్తే కొంతకాలం పాటు నగరంలోని ప్రధాన మార్గాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యామ్నాయంగా వన్‌వే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.నెల రోజుల క్రితం అమలు చేసిన వన్‌వే విధానంతో మొదట్లో వాహనదారులు కొంత ఇబ్బంది పడ్డారు. అయితే ఒకట్రెండు రోజుల తర్వాత పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. మూడో రోజు నుంచి ప్రధాన సిగ్నళ్ల వద్ద ఎక్కువసేపు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా వాహనాలు సాఫీగా కదలడం ప్రారంభించాయి. దీంతో కేబీఆర్‌ పార్కు చుట్టుపక్కల ట్రాఫిక్‌ సమస్యను భారీ నిర్మాణాలు చేపట్టకుండానే పరిష్కరించే అవకాశం ఉందని అధికారులు భావించారు.ట్రాఫిక్‌ రద్దీ మెరుగుపడిన నేపథ్యంలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి స్టీల్‌ బ్రిడ్జీలు, అండర్‌పాస్‌లు నిర్మించడం అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించింది.పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ ప్రత్యేక అధికారి జయేశ్‌రంజన్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌ కూడా సమావేశంలో పాల్గొన్నారు.జూబ్లీ చెక్‌పోస్టు, కేబీఆర్‌ పార్కు గేట్‌, ముగ్ధా జంక్షన్‌, బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి పరిసరాలతో పాటు ఇతర కూడళ్లలో ప్రతిపాదించిన నిర్మాణాలను రద్దు చేయాలని నిర్ణయించారు. ఆయా పనుల కోసం కేఎన్‌ఆర్‌, మేఘా సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసేందుకు కూడా స్థాయీ సంఘం ఆమోదం తెలిపింది. దీంతో కేబీఆర్‌ పార్కు చుట్టూ భారీ నిర్మాణాలతో ట్రాఫిక్‌ నిర్వహణకు సంబంధించిన పాత ప్రణాళికకు తెరపడింది.ఇదే సమయంలో పంజాగుట్ట నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు కొత్త ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పంజాగుట్ట ఎన్‌ఎఫ్‌సీఎల్‌ కూడలి నుంచి జూబ్లీ చెక్‌పోస్టు మెట్రో స్టేషన్‌ రోడ్డును, అంటే జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 36ను కలుపుతూ ఆరు లైన్ల పైవంతెన నిర్మించనున్నారు. ఈ కారిడార్‌ సుమారు నాలుగు కిలోమీటర్ల పొడవు ఉండనుంది. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 3లోని ముఫకంజా విద్యాసంస్థల సమీపంలో పైవంతెనపైకి ఎక్కే వాహనాలు నేరుగా జూబ్లీ చెక్‌పోస్టు మెట్రో స్టేషన్‌ కిందకు చేరుకునేలా డిజైన్‌ రూపొందించనున్నారు. అదే విధంగా చెక్‌పోస్టు మెట్రో స్టేషన్‌ వద్ద కారిడార్‌పైకి ఎక్కే వాహనాలు ముఫకంజా కాలేజీ ప్రాంతంలో దిగేలా ఏర్పాట్లు చేయనున్నారు.బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 1 వైపు వెళ్లే వాహనాల కోసం ఎలివేటెడ్‌ కారిడార్‌ నుంచి జలగం వెంగళరావు పార్కు వరకు ప్రత్యేక ర్యాంపును నిర్మించే ప్రతిపాదన కూడా ఉంది. ప్రస్తుతం డిజైన్ల రూపకల్పన పూర్తికావాల్సి ఉండటంతో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం, నిర్మాణ విధానం, ఇతర సాంకేతిక అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. కేబీఆర్‌ పార్కు చుట్టూ ప్రతిపాదించిన పాత ప్రాజెక్టు రద్దు కావడంతో కొత్త ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణ బాధ్యతను జీహెచ్‌ఎంసీ మేఘా సంస్థకు అప్పగించింది.ఈ మార్పుతో భారీ స్థాయి కూడళ్ల అభివృద్ధికి బదులుగా ట్రాఫిక్‌ రద్దు వేగవంతం చేసే ప్రత్యామ్నాయ మౌలిక వసతులపై దృష్టి సారించినట్టైంది. ముఖ్యంగా పంజాగుట్ట–బంజారాహిల్స్‌–జూబ్లీ చెక్‌పోస్టు మార్గంలో సిగ్నల్‌ ఆధారిత ట్రాఫిక్‌ను తగ్గించి, వాహనాల నిరంతర రాకపోకలకు అనువైన కారిడార్‌ ఏర్పాటు చేయడమే కొత్త ప్రణాళిక ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!