అర్జున్ సమాచారం:సంగారెడ్డి జిల్లాలోని మంజీరా డ్యామ్‌ను “అమృత్ ధరోహర్” పథకం కింద ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిందిగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ను కోరారు.ప్రభాకర్ ఢిల్లీలో శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్రతో కలిసి మంత్రి షెఖావత్ తో భేటీ అయ్యారు.మంజీరా డ్యామ్ ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తూ, దానికి సంబంధించిన వెట్‌ల్యాండ్‌కు అంతర్జాతీయ రామ్‌సార్ గుర్తింపు లభించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు.మంజీరా నదిపై నిర్మించిన మంజీరా డ్యామ్ తెలంగాణలో అత్యంత కీలకమైన జలాశయాల్లో ఒకటని వారు కేంద్ర మంత్రి షెఖావత్ కు తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు పరిసర ప్రాంతాలకు తాగు,సాగునీరు అందించడంలో ఇది ముఖ్య భూమిక పోషిస్తున్నదని వినతిపత్రంలో వివరించారు.గతంలో హైదరాబాద్ నగరానికి కూడా ప్రధాన తాగునీటి వనరుగా సేవలందించిందని పేర్కొన్నారు.
మంజీరా డ్యామ్ చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం, జీవవైవిధ్యం ఎకో టూరిజం అభివృద్ధికి విశేష అవకాశాలను కల్పిస్తోందని తెలిపారు. సమీపంలోని మంజీరా వన్యప్రాణుల అభయారణ్యం, అందులోని మొసళ్లు, మంచినీటి తాబేళ్లు, అనేక జలచర జీవులకు నిలయంగా ఉండటంతో పాటు, ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా నిలిచిందని మంత్రి దృష్టికి తెచ్చారు.
మంజీరా వెట్‌ల్యాండ్‌లో సుమారు 313 రకాల పక్షులు, వాటిలో 117 రకాల వలస పక్షులు ప్రతి ఏడాది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నాయని చెప్పారు. అలాగే జలాశయంలోని తొమ్మిది సహజ ద్వీపాలు పక్షులు, ఇతర వన్యప్రాణుల గూళ్లు నిర్మించుకోవడానికి, సంతానోత్పత్తికి అనువైన ఆవాసాలుగా ఉండటంతో ఈ ప్రాంతం తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన జీవవైవిధ్యమైనదిగా గుర్తింపు పొందిందన్నారు.
ఈ విశిష్ట జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అమృత్ ధరోహర్ పథకం కింద మంజీరా డ్యామ్‌ను సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ప్రభాకర్ కేంద్ర మంత్రిని కోరారు.
=============================
ఎంపీ వద్దిరాజుతో కలిసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ను కలిసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మంజీరా డ్యామ్‌ను ఎకో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలి – అమృత్ ధరోహర్ పథకంలో చేర్చి రామ్‌సార్ గుర్తింపునకు సహకరించాలి: కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే ప్రభాకర్ విజ్ఞప్తి
RELATED ARTICLES

