హైదరాబాద్,అర్జున్ సమాచారం:
ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు పరిరక్షించాల్సిన జాతీయ ఆస్తులని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటైజేషన్ నిలిపేయాలన్న తమ విజ్ఞప్తికి ఆందోళనకు మద్దతు తెలపాలని ఆల్ ఇండియా ఐడీబీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేస్తూ.. తనకు ట్యాగ్ చేసిన అంశంపై కేటీఆర్ స్పందించారు. ఐడీబీఐ బ్యాంకు విలువను తక్కువగా అంచనా వేస్తున్నారన్న నివేదికలు నిజంగా ఆందోళన కలిగిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేంద్రానికి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. బిడ్లు రిజర్వ్ ధర కంటే తక్కువకు పడిపోయినప్పుడు, నిబంధనలను, విలువ నిర్దారణ పద్దతిని ఎందుకు మార్చారన్నారు. ఐడీబీఐకి హైదరాబాద్లోని ప్రధాన భూమితో సహా విలువైన స్థిరాస్తి ఆస్తులు కూడా ఉన్నాయి. మరి వాటి విలువను సరిగ్గా లెక్కించారా..? ఐడీబీఐ ఉద్యోగులు లేవలెత్తిన ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదు..? ఒక ప్రతిష్మాత్మక ప్రభుత్వ రంగ బ్యాంకును ప్రైవేట్ సంస్థలకు అమ్మే ముందు, కేంద్ర ప్రభుత్వం దేశానికి కొన్ని సూటి సమాధానాలు ఇవ్వాలి.. ఎందుకంత తొందర..? అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశానికి పేరున్న ప్రభుత్వ రంగ బ్యాంకును ప్రైవేట్ సంస్థకు అప్పగించే ముందు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానాలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశ ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థల విలువ, భవిష్యత్తు విషయంలో పారదర్శకత ఎందుకు పాటించడం లేదు..? అని కేంద్రాన్ని అడిగారు.

