ePaper
Monday, September 14, 2026
ePaper
Homeతెలంగాణఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్ ఎన్నిటికైనా దిగజారుతారు.

ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్ ఎన్నిటికైనా దిగజారుతారు.

📰 Generate e-Paper Clip

ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్ ఎన్నిటికైనా దిగజారుతారు.

కాటారం ప్రజలకు చేసిందేమీ లేదు.. చెరువుల్లో నీళ్లు ఆపకుండా భూములను ఎండబెడుతున్నారు
కాంగ్రెస్‌, దుద్దిళ్ల శ్రీధర్‌ మెడలు వంచే వరకు పోరాటం చేస్తా
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 14 | కాటారం

ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌ ఎన్నిటికైనా దిగజారుతారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ విమర్శించారు. కాటారం మండలంలోని ఒడిపిలవంచ ఊర చెరువు, జాదరావుపేట పెద్ద చెరువు, వీరాపూర్‌ శివశంకర్‌ ప్రాజెక్టులను సోమవారం బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా పుట్ట మధూకర్‌ మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడల్లా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రస్తావిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఏడాదిలోపు పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని గతంలో హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి పరిహారం అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నప్పటికీ, మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు పరిహారం అందలేదని అన్నారు.

కాటారం మండల ప్రజలు ప్రతి ఎన్నికల్లో దుద్దిళ్ల శ్రీధర్‌కు మెజార్టీ ఇస్తున్నప్పటికీ, మండల అభివృద్ధిపై మాత్రం శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. 2009లో ఆరు వేలకు పైగా, 2014లో 239, 2018లో 6,585, 2023లో 7,480 ఓట్ల మెజార్టీ కాటారం ప్రజలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇంతటి మెజార్టీ అందిస్తున్న ప్రజలకు తిరిగి చేసిందేమీ లేదని విమర్శించారు.

మూడు చెరువుల కింద వేలాది ఎకరాల భూములు ఉన్నప్పటికీ సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాలు కురిసి చెరువుల్లోకి వచ్చే నీటిని నిల్వ చేసుకునేలా రింగ్‌బండ్‌లు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేయడం లేదని విమర్శించారు. నీటిని నిల్వ చేయకుండా వృథాగా సముద్రంలోకి పంపుతున్నారని ఆరోపించారు.

మంథని–కాటారం ప్రధాన రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పుట్ట మధూకర్‌ అన్నారు. ఈ సమస్యపై కూడా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

దుద్దిళ్ల కుటుంబానికి కాటారం ప్రజలతో ఓటు సంబంధం తప్ప మరే సంబంధం లేదని ఆయన ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారని, ఎన్నికల అనంతరం వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

తనకు కాటారం ప్రజలతో పేగు సంబంధం ఉందని, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతానని పుట్ట మధూకర్‌ తెలిపారు. చెరువుల్లో నీటిని నిల్వ చేసి రైతుల భూములను సాగులోకి తీసుకురావాలన్నదే తన లక్ష్యమన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ, దుద్దిళ్ల శ్రీధర్‌ మెడలు వంచే వరకు అహర్నిశలు పోరాటం చేస్తానని ప్రకటించారు. ఇప్పటికైనా దుద్దిళ్ల శ్రీధర్‌ కళ్లు తెరిచి వచ్చే వానాకాలం నాటికైనా కాటారం మండలంలోని చెరువులను పునరుద్ధరించి, వేలాది ఎకరాల భూములను సాగులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!