హైదరాబాద్, ఆగస్టు 29,అర్జున్ సమాచారం:
జీవ వైవిద్యానికి ప్రతీకగా చరిత్రకెక్కిన కాప్రా చెరువు.. సాధారణ నీటి వనరు మాత్రమే కాదు.. నగర పర్యావరణ సమతుల్యతకు కీలకమైన వెట్‌ల్యాండ్ అని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో కాప్రా చెరువులో గణేష్ నిమజ్జనం సరికాదన్నారు. చెరువు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు కాప్రా చెరువుకు వచ్చిన హైడ్రా కమిషనర్ ఇదే విషయాన్ని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ స్థానిక ప్రతినిధులకు వివరించారు. చిన్న విగ్రహాలు నిమజ్జనానికి చెరువు చెంత ఉన్న బేబీ పాండ్‌ను వినియోగించుకోవాలని సూచించారు. అర్బన్ వెట్‌ల్యాండ్స్‌లో భాగంగా ఉన్న ఈ చెరువు లక్ష్యాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కాప్రా చెరువులో 70 శాతం వరకూ ప్రైవేట్ పట్టా భూములున్నా.. వారంతా ముందుకు వచ్చి చెరువు అభివృద్ధికి సహకరించారన్నారు. కాప్రా లేక్ రివైవల్ గ్రూప్ ప్రతినిధులు కూడా హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారిని కలిసారు. చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. చెరువుకు వచ్చే వలస పక్షుల చిత్రాలతో కూడి ఫొటో ఎగ్జిబిషన్‌ను హైడ్రా కమిషనర్ తిలకించారు. ఆస్ట్రేలియా, యూరప్‌తో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే 470కు పైగా వలస పక్షులకు ఆవాసంగా ఈ చెరువును కేంద్రం ఇదివరకే గుర్తించిందని కమిషనర్ చెప్పారు. కేంద్రం ప్రకటించిన అర్బన్ వెట్ ల్యాండ్ జాబితాలో కాప్రా చెరువు ప్రధానంగా ఉందన్నారు. మంజీరా వైల్డ్‌లైఫ్ సాంక్చువరీ (Manjira Wildlife Sanctuary), పాఖల్ లేక్ వైల్డ్‌లైఫ్ సాంక్చువరీ (Pakhal Lake Wildlife Sanctuary) కూడా ఈ జాబితాలో ఉన్నాయని గుర్త చేశారు. వెట్ ల్యాండ్స్ పరిరక్షణ, నిర్వహణ రూల్స్ 2017 ప్రకారం చెరువు హద్దులు నిర్ధారించడం, ఆక్రమణలు జరగకుండా చూడడం, కాలుష్యం నుంచి కాపాడడం వంటి బాధ్యతలున్నాయన్నారు. ఈ క్రమంలోనే 113 ఎకరాల కాప్రా చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తోందని చెప్పారు. వరద నీటి నిల్వ, భూగర్భ జలాల పునరుద్ధరణ, జీవవైవిధ్యం, పక్షుల ఆవాసం వంటి పర్యావరణ హితమైన అంశాల ప్రాతిపదికన ఈ చెరువును అభివృద్ధి చేస్తున్నామని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కాప్రా చెరువులో గణేష్ నిమజ్జనం సరికాదని.. అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పెద్ద విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులకు సూచించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్త గారు, హైడ్రా ఏసీపీ ఉమా మహేశ్వర్ రావుతో పాటు, చెరువుల అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టక్నోక్రాట్స్ డైరెక్టర్ యూనస్ గారు హైడ్రా కమిషనర్ పర్యటనలో ఉన్నారు.
=====================

