ePaper
Saturday, November 14, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతితిరుమల వేంకటేశుడికి రూపమిచ్చిన చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూత - తమిళనాడులోని కోవిల్పట్టిలో వృద్ధాప్యంతో మృతి

తిరుమల వేంకటేశుడికి రూపమిచ్చిన చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూత – తమిళనాడులోని కోవిల్పట్టిలో వృద్ధాప్యంతో మృతి

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం:
1970లో టీటీడీ ఆహ్వానంతో గర్భగుడిలో స్వామిని చూసి చిత్రాలు గీసిన శ్రీనివాసన్
ఆభరణాలతో, ఆభరణాలు లేకుండా రెండు రూపాల్లో చిత్రాలు
ఇంటింటా పూజలందుకుంటున్న ఆయన చిత్రాలు
తిరుమల: ఇంటింటా పూజలందుకుంటున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి చిత్రానికి ప్రాణం పోసిన ప్రఖ్యాత చిత్రకారుడు ఎస్.ఎం. శ్రీనివాసన్ (86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టిలోని తన స్వగృహంలో గురువారం తుది శ్వాస విడిచారు. తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్, పదో తరగతి వరకు చదివి ప్రముఖ చిత్రకారుడు కొండయ్య రాజు వద్ద చిత్రకళలో శిక్షణ పొందారు. ఆయన ప్రతిభను గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 1970లో ప్రత్యేకంగా ఆయనను ఆహ్వానించింది. గర్భగుడిలోని మూలవిరాట్టును నేరుగా దర్శించి, స్వామివారి దివ్య రూపాన్ని ఆయన తన కుంచెతో చిత్రించారు. స్వామివారు సర్వాభరణాలతో అలంకరించుకున్న రూపం ఒకటి, ఆభరణాలు లేకుండా ఉన్న నిరాడంబర రూపం మరొకటి.. ఇలా రెండు రకాల అద్భుతమైన చిత్రాలను ఆయన గీశారు. ఈ చిత్రాలు అనతికాలంలోనే భక్తుల్లో అశేష ప్రాచుర్యం పొందాయి. నేడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి ఇంట్లో, వ్యాపార సంస్థలో కనిపించే శ్రీవారి చిత్రం శ్రీనివాసన్ గీసిందే. వేంకటేశ్వరస్వామితో పాటు ఆయన పలు ఇతర హిందూ దేవతామూర్తుల చిత్రాలను కూడా గీసి మెప్పించారు. కోవిల్పట్టిలోని మండిత్తోప్పు రోడ్డులో ఉన్న ఆయన నివాసంలో మరణవార్త తెలియగానే, పలువురు ప్రముఖులు, స్థానికులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. శ్రీవారి రూపానికి తన కుంచెతో శాశ్వతత్వాన్ని అందించిన శ్రీనివాసన్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
=====================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!