న్యూఢిల్లీ, అక్టోబరు 5,అర్జున్ సమాచారం:
కేవలం పేపర్ రిపోర్ట్ ఆధారంగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ పనితీరు, చర్యలపై లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధించిన పిటిషన్‌లను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. సీఈసీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌లో ఎస్‌ఐటీ విచారణ జరిపించాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియను సైతం చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని అందులో కోరారు. ఈ వ్యవహారంలో కేం ప్రభుత్వం, ముగ్గురు ఎన్నికల కమిషనర్లు, క్యాబినెట్ కార్యదర్శి, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మనీష్ గర్గ్, ఐటీ హెడ్ సీమా ఖన్నాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.పిటిషనర్ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఎన్నికల కమిషనర్ల నియామకంతో పాటు వారికి కల్పించే అధికారాలకు సంబంధించి చట్టంలో మార్పులు చేశారని కోర్టుకు తెలిపారు. సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్లు తమ పదవీకాలంలో చేసిన పనులకు సంబంధించి వారిపై ఎలాంటి కేసు నమోదవుకుండా మినహాయింపు ఉంటున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా తమ పనితీరు ప్రక్రియను స్వయంగా నిర్ణయించుకునే అధికారం కూడా ఎన్నికల కమిషనర్లకు ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వికాస్ సింగ్ మాట్లాడుతూ.. “ఈరోజు ప్రధానంగా మా వాదన ఏంటంటే.. దేశ ప్రధానమంత్రికి కూడా లేని రక్షణను ఎన్నికల కమిషనర్లకు ఏ విధంగా కల్పించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని కోర్టును కోరుతున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ‘అలా అయితే ఎన్నికల కమిషన్ ఎలా పనిచేస్తుంది?’ అని ప్రశ్నించింది. దానికి లాయర్ వికాస్ సింగ్ ‘సీఈసీతో పాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పనిచేస్తారు అని బదులిచ్చారు. అయితే మేం మీ పిటిషన్‌ను పరిశీలించాల్సి ఉందని, ఏ పనైనా చట్టపరిధిలోనే జరుగుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది
20 ఏళ్ల క్రితం కేసును బయిటకు తీసిన కేరళ
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు సంబంధించిన 20 ఏళ్ల నాటి పాత కేసు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ఎస్ఐఆర్, ఎన్నికల రిగ్గింగ్ ఆరోపణల నేపథ్యంలో, కేరళం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వివాదాస్పద ఆత్మహత్య, అవినీతి కేసుపై విచారణకు ఆదేశించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. 2006లో కేరళం ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ) కార్యదర్శిగా జ్ఞానేష్ కుమార్ పనిచేసినప్పుడు ఈ వివాదం చోటుచేసుకుంది. ప్రపంచ బ్యాంకు నిధులతో సుమారు రూ.215 కోట్లతో కేరళం రాష్ట్ర రవాణా ప్రాజెక్ట్ కింద ఎంసీ రోడ్డు పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను తీసుకున్న మలేషియా కంపెనీకి చెందిన సివిల్ ఇంజినీర్ లిజ్జీ బీన్, రోడ్డు నిర్మాణంలో జరిగిన అవినీతిపై పలు ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత ఆమె మలేషియాకు వెళ్లి ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కేపీసీసీ నాయకుడు మలయింకీళు వేణుగోపాల్ శనివారం చేసిన ఫిర్యాదు మేరకు ఈ విచారణ మరోసారి తెరపైకి వచ్చింది. కేరళం హోం మంత్రి రమేష్ చెన్నితాల ఈ ఫిర్యాదుపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. సీఎం వి.డి. సతీసన్‌తో చర్చించిన అనంతరం, సమగ్ర విజిలెన్స్ విచారణ జరపాల్సిందిగా విజిలెన్స్ డైరెక్టర్ మనోజ్ అబ్రహాంను హోంశాఖ ఆదేశించింది. SIR వివాదం, పలు రాష్ట్రాల్లో భారీగా ఓట్ల తొలగింపు, ఈవీఎంలపై ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సీజేపీ , ప్రతిపక్షాలు దిల్లీలో నిరసనలు చేస్తున్నాయి. ఈ తరుణంలో జ్ఞానేష్ కుమార్ పై 20 ఏళ్ల క్రితం నమోదైన కేసును కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి వచ్చింది. ఈ కేసును విచారించాలని విజిలెన్స్ ను ఆదేశించింది.
======================

